ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు 17న సెలవు | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు 17న సెలవు

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

ఏటూరునాగారం : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, హనుమకొండ, జనగామ, వరంగల్‌ జిల్లాలోని ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు ఈనెల 17వ తేదీన సెలవు ఇస్తూ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన సంప్రదాయ పండుగ ‘పెద్దల పండుగ’ ఈనెల 17న నిర్వహించుకునే అవకాశం ఉండడంతో వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించామని, ఈ సెలవును అక్టోబర్‌ 10వ తేదీ రెండో శనివారం వర్కింగ్‌ డేగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల హెచ్‌ఎలు, వార్డెన్‌లు ఈ ఉత్తర్వులను పాటించాలని ఆదేశించారు.

మక్కలకు రికార్డు ధర

క్వింటాల్‌కు రూ.2,750 రేటు

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసా య మార్కెట్‌ యార్డులో మక్కలకు రికార్డు ధర పలికింది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు మార్కెట్‌కు వరుస సెలవులు రాగా.. మంగళవారం పునః ప్రారంభమైంది. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన రాజారపు పోశాలు 18 బస్తాల మక్కలు మార్కెట్‌కు తీసుకొచ్చారు. మార్కెట్‌లోని ఓ వ్యాపారి క్వింటాల్‌కు రూ.2,750 ధర చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో రైతు హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజనల్‌లో మక్కలకు మంచి ధర రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు.

విద్యుదాఘాతంతో

వ్యవసాయ కూలీ మృతి

మల్లక్‌పేటలో ఘటన

పరకాల : విద్యుదాఘాతంతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన పరకాల పట్టణంలోని మాదారం శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పరకాల మండలం మల్లక్‌పేట గ్రామానికి చెందిన రాసమల్ల కుమారస్వామి(50) పట్టణానికి చెందిన పిట్ట సమ్మయ్య వద్ద వ్యవసాయ కూలీ(పాలేరు)గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం తెల్లవారుజామున చేను వద్దకు వెళ్లిన కుమారస్వామి.. మోటారుకు విద్యుత్‌ వైరు సరిచేస్తున్న క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు హరీశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనాథలైన అన్నాచెల్లి..

కుమారస్వామి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి రజిత మృతిచెందగా మంగళవారం తండ్రి మృతిచెందాడు. దీంతో కూతురు అకిల, కుమారుడు హరీశ్‌ అనాథలయ్యారని, వీరిని యజమానితోపాటు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement