దుగ్గొండి:‘వర్షాలు మొహం చాటేశాయి.. వేసిన పంట భూమిలో సాగునీరు లేక ఎండిపోయింది. పంటకు తెచ్చిన అప్పు ముప్పుగా మారింది. బ్యాంక్ పంట రుణం కట్టమంటుంది. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థికంగా నష్టపోయాం.. రేవంతన్నా ఆదుకోండి’ అంటూ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం శివారులో ఓ మహిళా రైతు తన పంట భూమిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు కక్కెర్ల లక్ష్మీకి గ్రామ శివారులో ఎస్సారెస్పీ డీబీఎం–38 కాలువను ఆనుకుని 2.30 ఎకరాల భూమి ఉంది. దీనిలో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈసారి ఎండాకాలం అనంతరం కొద్దిపాటిగా కురిసిన వర్షానికి పత్తి పంట వేసింది. మొలకలు వచ్చిన తర్వాత వానలు పడలేదు. సాగునీరు ఇవ్వాలంటే బావి ఎండిపోయింది. పక్కనే ఎస్సారెస్పీ కాలువ ఉన్నా నీరు విడుదల చేయడం లేదు. ఫలితంగా పత్తి చేను ఎండిపోయింది. మళ్లీ కురిసిన కొద్దిపాటి వర్షానికి పెసర, మొక్కజొన్న వేసింది. కొద్ది రోజులకే సాగునీరు లేక అవి ఎండిపోయాయి. దుక్కికి, పంటకు తెచ్చిన అప్పు మిగిలింది. బ్యాంక్‌లో క్రాప్‌లోన్ చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. అప్పు చెల్లించాలంటూ ఇచ్చిన వారు తిరిగిపోతున్నారు. చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఆమె తన పంట పొలంలో అన్నదాతల కష్టాలు వివరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ‘ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నాం.. వర్షాలు లేక అప్పుల్లో కూరుకుపోయాం. మాలాంటి రైతుల్ని కాపాడండి. అన్నం పెట్టే అన్నదాతల ప్రాణాలు కాపాడండి’ అంటూ ముద్రించిన ఈ ఫ్లెక్సీ అటుగా వెళ్లే రైతులను ఆకర్షిస్తోంది.
పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మహిళా రైతు


