స్టేషన్‌ఘన్‌పూర్ : అజాగ్రత్తగా యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఆయుర్వేద వైద్యుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా ఘన్‌పూర్ శివారు తాటికొండ ఎక్స్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి భార్య కవిత కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటేశ్వర్ (53) హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో నివాసం ఉంటూ ఆయుర్వేద వైద్య వృత్తి చేస్తున్నాడు. కాగా, ఆయుర్వేద వైద్యం నిమిత్తం ఈనెల 12న కారులో వరంగల్ వెళ్లాడు. అక్కడ పనిముగించుకుని తిరిగి 14న (సోమవారం) హైదరాబాద్ బయలుదేరాడు. ఈ క్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ ఎక్స్‌రోడ్డు వద్ద మంచుప్పుల, పాలకుర్తి నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అజాగ్రత్తగా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా సడన్‌గా రోడ్డు క్రాస్ చేస్తోంది. ఈ సమయంలో కారు.. బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వెంకటేశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ కుమ్మరి ప్రభాకర్‌పై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ మంగళవారం తెలిపారు.
ఆయుర్వేద వైద్యుడి మృతి
ఘన్‌పూర్‌లో ఘటన


