డోర్నకల్‌లోని అంబేడ్కర్ నగర్‌లో 1968 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పెయింటర్ దుప్పటి నాగేందర్ చెరువు మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేయగా స్థానికులతో పాటు రైల్వే కాలనీకి చెందిన ఉద్యోగస్తుల కుటుంబాలతో కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారు. తొమ్మిది రోజులు పూజలతోపాటు కోలాటాలు నాటికల ప్రదర్శనలతో కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించేవారు. నిమజ్జనానికి రైల్వే బాక్సులు మోసుకెళ్లే తోపుడు బండిని వినియోగించి బండిపై విగ్రహాన్ని ఊరేగించి సమీపంలోని రైల్వే బావిలో నిమజ్జనం చేసేవారు. మొదట మట్టి విగ్రహం తోపుడు బండి డప్పుచప్పుళ్లు ఉండగా తర్వాత ఎడ్ల బండి, బ్యాండ్ మేళాలు వినియోగించారు. 58 ఏళ్లుగా క్రమం తప్పకుండా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.


