● ఎఫ్‌ఆర్వో జి.ప్రసాదరావు
గూడూరు: అటవీ జంతువులను వేటాడి చంపిన వారికి కఠినమైన జైలుశిక్ష ఉంటుందని ఎఫ్‌ఆర్వో జి.ప్రసాదరావు హెచ్చరించారు. పందిని చంపిన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మాంసం విక్రయించిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎఫ్‌ఆర్వో తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 5వ తేదీన బయ్యారం మండలం జప్రాబాద్ తండాకు చెందిన గుగులోతు గౌరీశంకర్.. మట్టెవాడ సమీప అడవిలో అడవి పందిని చంపి, మాంసం పట్టుకొని వస్తూ పెట్రోలింగ్‌లో ఉన్న సిబ్బందిని చూసి మాంసం వదిలేసి పరారయ్యాడు. ఈక్రమంలో విచారణ చేపట్టగా మట్టెవాడకు చెందిన గుండెబోయిన హరీష్, బానోతు సురేష్ 4 కిలోల మాంసాన్ని రూ.వెయ్యికి గౌరీశంకర్ వద్ద తీసుకున్నట్లు తేలింది. ఈనెల 9న వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రసాదరావు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల జైలు విధించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఫారెస్టు సిబ్బంది మహేందర్, చాణక్య తదితరులు పాల్గొన్నారు.


