పొద్దు పొడిస్తేనే మోటారు నడిచేది | - | Sakshi
Sakshi News home page

పొద్దు పొడిస్తేనే మోటారు నడిచేది

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

9 – 10 గంటలే సరఫరా

హన్మకొండ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తి ఆగమవుతున్న అన్నదాతలను అప్రకటిత విద్యుత్‌ కోతలు వేధిస్తున్నాయి. పొద్దు పొడిస్తే కాని త్రీఫేజ్‌ సరఫరా చేయలేని దుస్థితిలో విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉంది. జల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గడంతో పాటు అవసరాల మేరకు థర్మల్‌ పవర్‌ ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పీక్‌ అవర్‌ సాయంత్రం 6 గంటల తర్వాత విద్యుత్‌కు భారీ డిమాండ్‌ ఉండడంతో ఆ సమయంలో వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. సోలార్‌ విద్యుత్‌ సమయంలోనే వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే గత రెండు, మూడు నెలలుగా త్రీఫేజ్‌ సరఫరా చేస్తున్నారు. నగరాలు, ప్రధాన పట్టణాలకు మాత్రం 24 గంటల పాటు నిరంతరాయంగా సరఫరా జరుగుతోంది.

గ్రామాల్లో సమస్య తీవ్రం

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్య జఠిలంగా మారింది. పొద్దు పొడిచి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఎప్పుడు అవుతుందో అప్పుడే త్రీఫేజ్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో ఒక సమయపాలన అంటూ లేకుండా విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. సూర్యోదయాన్ని బట్టి ఉదయం 7 నుంచి 7.30 గంటలకు త్రీఫేజ్‌ సరఫరా మొదలవుతోంది. తిరిగి సూర్యాస్తమయానికి త్రీఫేజ్‌ సరఫరా నిలిచిపోతోంది. దీంతో గ్రామాల్లో సాయంత్రం 5.30, 6 గంటల నుంచి ఉదయం 7 నుంచి 7.30 గంటల వరకు సింగిల్‌ ఫేజ్‌ సరఫరా జరుగుతోంది. ఈ విషయమై పలువురు విద్యుత్‌ అధికారులతో మాట్లాడగా సోలార్‌ పవర్‌ ఉత్పత్తి అవుతున్న సమయంలోనే వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అయితే, విద్యుత్‌ కోతలపై అధికారులు మాట్లాడేందుకు సాహసించడం లేదు. రైతులు, ఇతర వినియోగదారుల నుంచి కాల్స్‌ వస్తున్నాయని, వారికి ఏదో సమస్య ఉందని సర్దిచెప్పుతున్నామని, నేరుగా కోతలు విధిస్తున్నామని చెప్పలేక పోతున్నామని అంటున్నారు. గ్రిడ్‌పై భారం పడుతుండడంతో ఒక్కోసారి 133/33 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి 33/11 కేవీ సబ్‌ స్టేషన్లకు విద్యుత్‌ సరఫరా పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నారు.

అప్రకటిత విద్యుత్‌ కోతలతో రైతుల అవస్థలు

సూర్యోదయం నుంచి

సూర్యాస్తమయం వరకే త్రీఫేజ్‌ విద్యుత్‌

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సమయంలోనే త్రీఫేజ్‌ సరఫరా

18 గంటల నుంచి 10 గంటలకు

సరఫరా కుదింపు

18 జిల్లాల్లో పంటల

సాగు వివరాలు (ఎకరాల్లో)

పంటలు ఈ ఏడాది గతేడాది

64,26,574 68,12,574

వరి 32,98,891 29,41,203

మొక్కజొన్న 3,84,891 3,68,906

పప్పు దినుసులు 2,02,877 2,82,664

పత్తి 22,23,201 24,00,532

గత 10 రోజులుగా టీజీ ఎన్పీడీసీఎల్‌లో విద్యుత్‌ డిమాండ్‌ చూస్తే కనిష్ఠంగా 5,178 మెగావాట్ల నుంచి ఈనెల 9న గరిష్ఠంగా 6,948 మెగావాట్లు నమోదైంది. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2,131 మెగావాట్లు సోలార్‌ విద్యుత్‌ ఉంది. ఎన్పీడీసీఎల్‌లో 3,444.97 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి సరిపడా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఈ సమయంలోనే వ్యవసాయానికి త్రీఫేజ్‌ సరఫరా చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేజ్‌ సరఫరా చేసేవారు. తర్వాత రాత్రి ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా జరిగేది. రోజుకు 17, 18 గంటల పాటు త్రీ ఫేజ్‌ సరఫరా జరిగేది. కొద్ది రోజులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా చేశారు. ఇప్పుడు 9 లేదా 10 గంటలు మాత్రమే విద్యుత్‌ ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒక రోజు, ఉదయం 7.30 గంటల నుంచి మరో రోజు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా జరుగుతోందని అంటున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement