కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని బిల్డింగ్ డివిజన్ కార్యాలయంలో చోరీకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం రాత్రి విఫలయత్నం చేశాడు. ఉద్యోగుల కథనం ప్రకారం.. ఇద్దరు కేయూ ఉద్యోగులు శుక్రవారం ఉదయం కార్యాలయానికి వచ్చి తాళంతీసి లోపలకు వెళ్లగా గదుల్లో టేబుల్ డెస్క్‌లు చిందరవందరగా పడి కనిపించాయి. దీంతో వెంటనే వారు కేయూ అభివృద్ధి అధికారి వై.వెంకయ్యకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చూసి రిజిస్ట్రార్, కేయూ పోలీస్టేషన్ సమాచారం అందించారు. దీంతో రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కేయూ ఎస్సై కల్యాణ్‌కుమార్ చేరుకుని పరిశీలించారు. మెట్ల మార్గంలో కార్యాలయంలోకి దొంగ వెళ్లినట్లు గుర్తించారు. వివిధ గదుల్లోని టేబుల్స్ డెస్క్‌లను నిందితుడు తెరిచి చూశాడు. అయితే, ఓ టేబుల్ డెస్క్‌లోని పెన్‌డ్రైవ్‌ను మాత్రం చోరీచేశాడు. అందులో వివిధ ఫైళ్లకు సంబంధించిన సమాచారం ఉందని తెలుస్తోంది. అలాగే, సూపరింటెండెంట్ గదిలోకి వెళ్లి అందులోని టేబుల్ డెస్క్‌లో వెతికాడు. ఓ బీరువాలోని అన్ని వస్తువులను బయటికి తీసి టేబుల్‌పై పెట్టాడు. తర్వాత కేయూ అభివృద్ధి గదిలోకి వెళ్లి లైట్లు వేసుకొని ఏసీ కూడా ఆన్ చేసుకున్నాడు. అయితే దొంగ ఏ వస్తువులను కూడా చోరీచేయలేదు. పెన్‌డ్రైవ్ మాత్రం చోరీ చేశాడు. కాగా, యూనివర్సిటీ భూముల కీలక డాక్యుమెంట్లు, వివిధ కీలక ఫైళ్లను చోరీ చేసేందుకు వచ్చాడ అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. చోరీచేసింది ఒక్కడా లేక ఇద్దరు ముగ్గురా అన్నది తెలియలేదు. కేయూ అభివృద్ధి అధికారి ప్రొఫెసర్ వై.వెంకయ్య ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అయితే, బిల్డింగ్ డివిజన్ ఆఫీస్ ప్రాంతంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఇప్పటికే ఆడిటోరియంలో రెండుసార్లు చోరీలు జరిగాయి. కేయూలో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అలాగే, కేయూ పోలీసుల పెట్రోలింగ్ కూడా ఉంటుంది. అయినా యూనివర్సిటీలో చోరీలు మాత్రం ఆగడం లేదు.
బిల్డింగ్ డివిజన్ కార్యాలయంలో ఘటన
ఓ పెన్‌డ్రైవ్ అపహరణ


