● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
హన్మకొండ అర్బన్: మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. ప్రతీ కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని చేరవేయాలనే లక్ష్యంతో సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సంఘమిత్ర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సంఘమిత్రలో చేరి తమ పరిధిలోని ప్రతి కుటుంబానికి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్, గంజాయి వినియోగం, విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు విలువైన సమాచారానికి తగిన బహుమతి అందిస్తామని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, పట్టణ స్థాయి సమాఖ్యల సభ్యులు కీలక పాత్ర పోషించాలని కోరారు. సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో మహిళల పాత్ర కీలకమని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రదేశాల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించే నాటికను ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించారు. కార్యక్రమంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీఏ పీడీ శ్రీను, మెప్మా పీడీ రాజేశ్వర్, ఏసీపీలు నర్సింహరావు, ప్రశాంత్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు. కాగా, వివిధ మహిళా సంఘాలకు చెందిన సుమారు వెయ్యిమంది సభ్యులు పాల్గొన్నారు.


