● ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న
ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్
● విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
● పట్టించుకోని అధికారులు
మహబూబాబాద్ అర్బన్: ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. అద్దె భవనంలో నిర్వహణ, ఆపై అరకొర వసతుల నడుమ విద్యనభ్యసిస్తున్నారు. గూడూరు ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్.. జిల్లా కేంద్రంలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. దీంతో సరైన వసతులు లేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
అరకొర వసతులతో..
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల భవనంలో 2019లో గూడూరు ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. భవనానికి నెలకు అద్దె రూ.2.25లక్షలు చెల్లిస్తున్నారు. మొత్తం 419మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చుదువుతున్నారు. పదకొండు తరగతి గదులు ఉన్నాయి. ప్రతీ తరగతికి రెండు సెక్షన్ల చొప్పున మొత్తం 60మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులను ఇతర ప్రాంతాల పాఠశాలలకు తరలించి విద్యాబోధన చేస్తున్నారు.
గదుల కొరత..
అద్దె భవనంలో సరిపడా తరగతి గదులు లేక.. 7, 8వ తరగతికి చెందిన కొంతమంది విద్యార్థులను బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య గురుకుల పాఠశాల, కొత్తగూడ గురుకుల పాఠశాలకు తరలించి విద్యాబోధన కొనసాగిస్తున్నారు.
తరగతి గదులే డార్మెటరీలు..
విద్యార్థులు తరగతి గదులే డార్మెటరీలుగా మార్చుకుంటున్నారు. పగలు చదువుకోవడం, రాత్రి పడుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడుగురికి ఒక బాత్రూమ్ ఉండాలి. కానీ, 30 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున బాత్రూమ్‌లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల బాధలు వర్ణణాతీతం. అలాగే క్రీడా మైదానం ఇరుకుగా ఉంది. మినరల్ వాటర్ ప్లాంట్ లేక బయటనుంచి తాగునీరు కొనుగోలు చేస్తున్నారు.
నత్తనడకన పనులు..
ప్రభుత్వం గూడూరు మండల కేంద్రంలో పాఠశాల కోసం నూతన భవనం మంజూరు చేయగా.. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని శాశ్వత భవనాలు త్వరగా నిర్మించి సకల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నూతన భవనం అందుబాటులోకి తీసుకురావాలి
అద్దె భవనంలో విద్యార్థులకు సరైన తరగతి గదులు లేక డిజిటల్ విద్యను పూర్తిస్థాయిలో అందిచలేకపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని గూడూరులో చేపడుతున్న భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం.
–రమేష్, ఏకలవ్య గురుకుల
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ అద్దె భవనంలో కొనసాగడంతో సరైన వసతులు లేక విద్యార్థులకు తరచూ విష జ్వరాలు వస్తున్నాయి. ఫుడ్‌పాయిజన్ వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్కూల్‌కు స్టాఫ్ నర్సును ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యంతో పాటు నాణ్యమైన విద్య అందించాలి.
–బోనగిరి మధు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి


