కేసముద్రం: ఇంట్లో నల్లా ఉంది.. కానీ నీరు మాత్రం రావడం లేదు. ఒకవైపు మంచినీటి బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోవైపు భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో కేసముద్రం మున్సిపాలిటీ ప్రజలు తాగునీటి కోసం గోస పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో వేసవిని తలపించేలా తాగునీటి కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి.
16తాగునీటి బావులు..
మున్సిపాలిటీ పరిధిలో 16వార్డుల్లోని పట్టణ ప్రజల తాగునీటి సరఫరాకు 16 బావులు, 18 ఓవర్ హెడ్‌ట్యాంక్‌లు ఉన్నాయి. అయితే కేసముద్రంవిలేజ్, సబ్‌స్టేషన్‌తండా, కేసముద్రంస్టేషన్‌లోని పలు వార్డుల్లో కొద్ది రోజులుగా నల్లాలు బంద్ అయ్యా యి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీళ్లు లేక, అన్ని మంచినీటి బావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మరోవైపు మిషన్ భగీరథ నీటి సరఫరా పది రోజులుగా నిలిచిపోయింది. నల్లాలు బంద్ కావడంతో, తాగునీరు లేక, మరోవైపు కనీస అవసరాలు తీర్చుకోలేక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వ్యవసాయ బావుల వద్దకు..
మున్సిపాలిటీ పరిధి సబ్‌స్టేషన్‌తండాలో సోలార్ పంపుసెట్ ద్వారా వస్తున్న తాగునీటిని ప్లాస్టిక్ బాటిళ్లలో పట్టుకుంటున్నారు. దుస్తువులు ఉతుక్కోవడం, గృహ అవసరాల నిమిత్తం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సుమారు 15 రోజులుగా నల్లాలు బంద్ కావడంతో తాగునీటి కోసం గోస పడుతున్నట్లు తండావాసులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల బావుల్లో జలాలు అడుగంటిపోవడం, మూడురోజులకు ఒకసారి బావుల్లో నీళ్లు ఊరడంతో నల్లానీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికై నా తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
చాలా గోస పడుతున్నాం..
15రోజులుగా నల్లానీళ్లు రావట్లేదు. మంచి నీళ్ల కోసం సోలార్ పంపు దగ్గరకు వెళ్తున్నాం. ఇక దుస్తువులు ఉతుక్కోవడానికి నీళ్లు లేక దూరంగా ఉన్న బావుల వద్దకు పోతున్నాం. భగీరథ నీళ్లు కూడా బంద్ అయ్యాయి. నీళ్లు లేక చాలా గోస పడుతున్నాం. వానాకాలంలో ఇంత ఇబ్బంది ఎన్నడూ రాలేదు.
–గుగులోతు విజయ, సబ్‌స్టేషన్‌తండా
మంచినీటి సమస్య పరిష్కరిస్తాం
బావుల్లో భూగర్భజలాలు అడుగంటి పోవడం, భగీరథ నీరు రాకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తింది. ఇప్పటికే నీళ్లు ఉన్న బావులను గుర్తించి, తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే అన్ని వార్డుల ప్రజలకు నీటి సమస్యను పరిష్కరిస్తాం.
–ఉదయ్, మున్సిపల్ ఏఈ, కేసముద్రం
కేసముద్రం మున్సిపాలిటీలో
తాగునీటికి కటకట
భగీరథ నీళ్లు రాక.. బావుల్లో నీళ్లు లేక
నల్లాల బంద్‌తో పట్టణ ప్రజల అవస్థలు
వేసవిని తలపిస్తున్న వానాకాలం


