● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: గణేష్ నవరాత్రోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించామని తెలిపారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాల సంఖ్య, నిర్వాహకుల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. గణపతి విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వీకరించి, అనుమతుల ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ విగ్రహం వివరాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్ పరిధిలోని విగ్రహాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల రాకపోకలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా ప్రధాన రహదారులను బ్లాక్ చేసి విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ మండలంలో ఉన్న గణేష్ నిమజ్జన ప్రాంతాల వివరాలను ముందుగానే సేకరించి, ఆయా ప్రాంతాలను అధి కారులు స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతిలేదని, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
క్రీడలతో పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపు
గూడూరు: క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఎస్పీ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ గురువారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్‌స్థాయి క్రీడా పోటీలు, ఎంపికల కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడలు ఆడడం వల్ల నాయకత్వ లక్షణాల పెంపొందడంతో పాటు శారీరక, మానసికోల్లాసానికి దోహదపడుతాయని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూ చనలను పాటిస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఎంఈఓ సుజాత, సర్పంచ్ వాంకుడోతు సునీత, సీఐ వినయ్‌కుమార్, ఎస్సై రమేష్‌బాబు, పీడీలు పాల్గొన్నారు.


