● తొర్రూరు ఆర్డీఓ గణేష్
నెల్లికుదురు: జిల్లాలో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని తొర్రూరు ఆర్డీఓ గణేష్ సర్వే అధికారులకు సూచించారు. మండలంలోని రామానుజాపురం గ్రామంలో వారం రోజలుగా చేపడుతున్న సర్వేను ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, తహసీల్దార్ చంద నరేష్‌తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో మొత్తం భూమి నిర్ధారణ, హద్దులు, ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, గ్రామంతో పాటు రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలు ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. భూ హక్కుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. సాగు చేసుకునే రైతులకు నూతన సర్వే నంబర్లు కేటాయించేందుకు సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు, ఇతర ప్రభుత్వ భూముల వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సమస్యలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. ఈ సర్వేకు రైతులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఐ సురేందర్, సర్వేయర్లు, జీపీఓలు పాల్గొన్నారు.


