హన్మకొండ: విద్యుత్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుంది. వర్షాకాలంలో వేసవిని మించిపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణలో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వర్షాలు కురువకపోవడంతో వాతావరణం చల్లబడలేదు. ఎండలు మండుతుండడంతో ఉక్కపోత పెరిగింది. దీంతో ఉక్కపోతనుంచి ఉపశమనం కోసం విద్యుత్ ఉపకరణాలు వినియోగం కొనసాగుతోంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్ సైతం పెరిగింది. ఈ డిమాండ్ నిలకడగా కాకుండా ప్రతీరోజు పెరుగుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌లో అధికశాతం వ్యవసాయానికి, గృహ అవసరాలు, వ్యాపార వాణిజ్య అవసరాలు, చిన్న చిన్న పరిశ్రమలకు విద్యుత్ వినియోగిస్తారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలు పెద్దగా లేవు. అయినా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వానాకాలంలో ఈ నెల 9న వేసవినిమించి రికార్డు స్థాయిలో 6,948 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. అంతకుముందు మార్చి 27న నమోదైన 6,574 మెగావాట్ల డిమాండ్ అత్యధికం. దీన్ని బ్రేక్ చేస్తూ ఈ నెల 9న రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో గరిష్టంగా 19,543 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. మార్చిలో అత్యధికంగా నమోదైన 18,548 మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించి ఇప్పుడు ఆల్‌టైం రికార్డు నమోదైంది. అదే విధంగా ఈ నెల 4న అత్యధికంగా 88.958 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 5వ తేదీన 83.292 మిలియన్ యూనిట్లు, 6న 84.792, 7న 84.441, 8న 88.708, 9న 88.548 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగించారు. గతేడాది వానాకాలంలో సెప్టెంబర్ 8న అత్యధికంగా 80.707 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించగా, ప్రస్తుత వా నాకాలంలో ఈ నెల 4న అత్యధికంగా 88.958 మి లియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది.
ముఖం చాటేసిన వర్షాలు..
ప్రస్తుత వర్షాకాలంలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో పంటలు పూర్తిగా భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేశారు. మోటార్లు వాడుతుండడంతో వి ద్యుత్ వినియోగం పెరిగింది. వరి పంటతో పాటు మెట్ట పంటలకు తడులు ఇస్తున్నారు. టీజీ ఎన్పీడీసీ ఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో అన్ని పంటలు కలిపి ఈ వానాకాలంలో 64,26,574 ఎకరాల్లో సాగు చేశా రు. గతేడాది యాసంగిలో 68,12,574 ఎకరాల్లో సాగు చేశారు. వ్యవసాయ అవసరాలతో పాటు గృహ, వాణిజ్య, ఇతర విభాగాల్లోను వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది.
టీజీ ఎన్పీడీసీఎల్‌లో 6,974 మెగావాట్ల గరిష్ట డిమాండ్
రాష్ట్రంలో 19,543 మెగావాట్ల గరిష్ట డిమాండ్
4న విద్యుత్ వినియోగం 88.958 మిలియన్ యూనిట్లు
ఉమ్మడి జిల్లాలో ఈ 6నుంచి 9వ తేదీ వరకు విద్యుత్ వినియోగం వివరాలు (మిలియన్ యూనిట్లలో)
జిల్లా 6 7 8 9
హనుమకొండ 6.33 5.96 6.14 5.83
వరంగల్ 4.144 4.21 4.183 4.374
జనగామ 4 4.24 4.32 4.6
మహబూబాబాద్ 4.123 3.52 3.82 3.95
భూపాలపల్లి 2.48 2.67 2.95 3.12
ములుగు 2.71 2.96 3.32 3.33
విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో)
జిల్లా 6 7 8 9
హనుమకొండ 303.76 313.74 315.84 314.23
వరంగల్ 277.39 304.21 300.72 312.6
జనగామ 345.02 354.10 367.59 374.75
మహబూబాబాద్ 392.7 381.21 395,25 427.14
భూపాలపల్లి 152.5 144.80 193.73 202.23
ములుగు 161.11 164.53 179.34 193.49


