కేసముద్రం: పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యాతండాజీపీ శివారు గుడితండా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుడితండాకు చెందిన బోడ సూర్య(42) తనకున్న వ్యవసాయభూమిలో వరిపంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటకు నీరు పారించేందుకు వ్యవసాయబావి వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేశాడు. అనంతరం బావిలో నీరు అడుగంటి మోటారు శబ్దం వచ్చింది. దీంతో బావి వైపునకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.
● బావిలో జారిపడి రైతు మృతి
● గుడితండాలో ఘటన


