ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

● రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు శ్వేత

పాలకుర్తి టౌన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు, ఐలమ్మ మునిమనువరాలు చిట్యాల శ్వేత అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో గురువారం ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి చిట్యాల శ్వేత పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ్‌ముఖ్‌ల ఆగడాలను ఎదురించిన వీరనారి ఐలమ్మ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌, రజక సంఘం నాయకులు పోగు శ్రీనివాస్‌, పసునూరి నవీన్‌, చిట్యాల సోమన్న, గుమ్మడిరాజుల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

కుమారుడిని దూరం చేశారని..

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

పాలకుర్తి టౌన్‌ (దేవరుప్పుల) : కుమారుడిని తననుంచి దూరం చేశారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చౌడూరులో జరిగింది. దేవరుప్పుల హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేందర్‌ కథనం ప్రకారం.. చౌడూరుకు చెందిన అమృతం ఆంజనేయులు కూతురు సునీత (28)కు 8 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన నల్ల సాయి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక సంవత్సరం తర్వాత బాబు జన్మించాడు. బాబు పుట్టిన కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోయాడు. దీంతో పెద్ద మనుషులు ఆ బాబును మృతురాలి అత్తంటి వారు తీసుకునేలా తీర్మానం చేశారు. అప్పటినుంచి ఆమె బాబు కోసం మనోవేదనకు గురవుతూ ఉండేది. ఈ క్రమంలో సునీతకు 2024 సంవత్సరం డిసెంబర్‌లో దేవరుప్పుల మండలం మున్‌పహాడ్‌కు చెందిన నల్ల సతీశ్‌తో వివాహం జరిగింది. అయినా తన కుమారుడు లేడని మనస్తాపం చెందుతూనే ఉండేది. ఈ క్రమంలో తన తల్లిగారి ఊరు చౌడూరులో ఈ నెల 8వ తేదీన మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలో వెళ్లింది. గమనించిన ఆమె తండ్రి అమృతం ఆంజనేయులు వెంటనే వరంగల్‌ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి మేనమామ గుడెల్లి సోమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేందర్‌ తెలిపారు.

ప్రాణం తీసిన చేపల వేట..

కుంటలో పడి యువకుడి మృతి

ాజీపేట అర్బన్‌ : చేపల వేట ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కాజీపేట మండలం అమ్మవారిపేట కుంట వద్ద చోటు చేసుకుంది. మృతుడి తల్లి రోండ్ల రమ కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన రోండ్ల రమ కుమారుడు వెంకటేష్‌రెడ్డి(26) కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ తరచూ చేపలు పట్టేవాడు. రోజు మాదిరిగానే ఈనెల 8వ తేదీన కూలీకి వెళ్లాడు. అదే రోజు రాత్రి 9 గంటలకు ఫోన్‌ చేయగా ఇంటికి వస్తున్నట్లు తెలిపి రాలేదు. ఉదయం వరకు వేచి ఉండి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆచూకీ కోసం తిరుగుతుండగా గురువారం రమ బంధువు శ్రీనివాస్‌రెడ్డి వచ్చి వెంకటేష్‌రెడ్డి బైక్‌ అమ్మవారిపేట కుంట వద్ద ఉందని తెలిపాడు. దీంతో తల్లి రమ అక్కడి వెళ్లి చూడగా వెంకటేష్‌రెడ్డి కుంటలో పడి చనిపోయాడు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని, తమకు ఎవరిపై అనుమానం లేదని తెలిపింది. ఈ ఘటనపై మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement