మామునూరు: నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉండే ప్రేమ జంటలను బెదిరించి, వీడియోలు తీసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా.. ఓ ఘర్షణలో యువకుడిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసింది. అడ్డు వచ్చిన మరో యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ తెలిపారు. బుధవారం వరంగల్ మామునూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మామునూరు ఏసీపీ వెంకటేష్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ సంతోష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ తిమ్మాపురం శివారు మంగలమ్మ కుంటకు చెందిన పాత నేరస్తుడు సామల పవన్, ఆర్టీఏ జంక్షన్ శ్రీసాయినగర్‌కు చెందిన పాత నేరస్తుడు ఈద జానకీరామ్, పెన్షన్‌పూర్‌కు చెందిన కారు డ్రైవర్ ముద్దెపాక మనోజ్, వరంగల్ శంభునిపేటకు చెందిన ఎస్‌డీ హుస్సేన్ కొంత కాలంగా ముఠాగా ఏర్పడ్డారు. భట్టుపల్లి, అమ్మవారిపేట శివారు ప్రాంతాల్లో బైక్‌లపై సంచరిస్తూ ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు. ఈక్రమంలో ఆగస్టు 30న భట్టుపల్లి రోడ్డు వద్ద ఓ ప్రేమ జంటను బెదిరించి వీడియో తీయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆ జంటకు సంబంధించిన యువకుడి స్నేహితుడు, తిమ్మాపురం గ్రామానికి చెందిన రోహిత్‌ను ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు నేరస్తులు బెదిరించి మద్యం, డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై రోహిత్, అతని బావమరిది మేకల గిరిధర్, నిందితులకు ఫోన్‌లో గొడవలు జరిగాయి. ఈక్రమంలో సెప్టెంబర్ 4న రాత్రి ఇరువర్గాలు బెస్తం చెరువు వెళ్లే దారిలో ఎదురుపడ్డాయి.
కత్తితో పొడిచి హత్య..
పథకం ప్రకారం కత్తితో వచ్చిన నిందితులు ఘర్షణ కు దిగారు. దీనిపై రోహిత్, గిరిధర్ తమ స్నేహితు డు తిమ్మాపురం గ్రామానికి చెందిన మేకల గౌతమ్(27)కు సమాచారం ఇచ్చారు. దీంతో మేకల గౌత మ్.. సాయి, సంతోష్‌తో కలిసి హుటాహుటిన ఘట నాస్థలికి చేరుకుని ఘర్షణ ఆపుతున్నాడు. ఈసమయంలో కోపోద్రెకులైన సామల పవన్, ముద్దెపాక మనోజ్ కత్తితో గౌతమ్‌పై దాడి చేయగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన రోహిత్‌పై కూడా దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయమైంది. అనంతరం నిందితులు పరారయ్యారు
వాహన తనిఖీలో పట్టుబడి..
వరంగల్ ఆర్టీఏ జంక్షన్ వద్ద మామునూరు పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించిన నలుగురు నిందితులు పవన్, జానకీరామ్, మనోజ్, హుస్సేన్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కాగా, మామునూరు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ సంతోష్, ఎస్సైలు ప్రవీణ్, నిస్సార్ పాషా, హరిశంకర్, సిబ్బందిని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్,ఏసీపీ వెంకటేష్ అభినందించారు.
గౌతమ్ హత్య కేసులో
నలుగురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఈస్ట్‌జోన్ డీసీపీ
అంకిత్ కుమార్


