సీజీఆర్‌ఎఫ్‌ వరంగల్‌ చైర్మన్‌గా మాధవరావు | - | Sakshi
Sakshi News home page

సీజీఆర్‌ఎఫ్‌ వరంగల్‌ చైర్మన్‌గా మాధవరావు

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌) వరంగల్‌ చైర్మన్‌గా కె.మాధవ రావు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు చైర్మన్‌గా కొనసాగిన వేణుగోపాలాచారి పదవీ కాలం రెండు నెలల క్రితం ముగిసింది. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం కమర్షియల్‌ విభాగం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నాగప్రసాద్‌కు సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించగా ఇప్పటి వరకు కొనసాగారు. కాగా, పూర్తి స్థాయిలో కె.మాధవ రావును నియమిస్తూ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, మాధవ రావుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ జాయింట్‌ సెక్రటరీలు కె.రమేష్‌, ఎన్‌.శ్రీకృష్ణ, జీఎంలు గిరిధర్‌, పి.మనోహర స్వామి, ఎం.హేమంత్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రావు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ఎట్టకేలకు దూరవిద్య ఎక్స్‌ అభ్యర్థులకు డిగ్రీ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: ఎట్టకేలకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (ఎస్‌డీఎల్‌సీఈ ) ఎక్స్‌ అభ్యర్థులకు డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షల టైంటేబుల్‌ను ఆ విభాగం అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈఏడాది జనవరిలోనే ఆయా ఎక్స్‌ అభ్యర్థుల నుంచి దూరవిద్యాకేంద్రంలో సంబంఽధిత అధికారులు ఫీజులు తీసుకున్నా పరీక్షల నిర్వహణలో జాప్యం చేశారు. దీంతో ఆ అభ్యర్థులు కొంతకాలంగా నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు పరీక్షల టైంటేబుల్‌ను విడుదల చేశారు. ఈనెల 21 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 21,23, 25, 28, 30, అక్టోబర్‌ 3, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. డిగ్రీ కోర్సుల సెకండియర్‌ పరీక్షలు ఈనెల 22, 24, 26, 29, అక్టోబర్‌ 1,5, 7వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజా తెలిపారు. ఫైనలియర్‌ వార్షిక పరీక్షలు ఈనెల 21,23, 25, 28, 30, అక్టోబర్‌ 3, 6, 8 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారని తెలిపారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో ఒకరి రిమాండ్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : చెక్‌ బౌన్స్‌ కేసులో ఒకరికి రిమాండ్‌ విధిస్తూ మహబూబాబాద్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ అర్వపల్లి కృష్ణతేజ బుధవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలను న్యాయవాది ఎస్‌.కె.పాషా వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సంగిరెడ్డి ఉపేంద్రమ్మ కుమారుడు రామ్మోహన్‌ రెడ్డి తనకు పరిచయం ఉన్న తొర్రూరు మండల కేంద్రానికి చెందిన బాధావత్‌ కిషన్‌కు రూ.4.69 లక్షలు నగదు అప్పుగా ఇచ్చారు. ఈ క్రమంలో కిషన్‌ తన పేరు మీద ఒక చెక్కును ఉపేంద్రమ్మ పేరిట రాసిఇవ్వగా ఆమె కొంతకాలానికి దానిని తన బ్యాంకు ఖాతాలో జమ చేసింది. చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపోను డబ్బులు లేకపోవు. దీంతో ఆ చెక్కు తిరస్కరణకు గురికాగా బాధితురాలు ఉపేంద్రమ్మ మహబూబాబాద్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆమె పక్షాన న్యాయవాది పాషా వాదించగా ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన బాదావత్‌ కిషన్‌ పేరు మీద నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఇందులో భాగంగా కిషన్‌ కోర్టులో రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దానిని అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ అర్వపల్లి కృష్ణతేజ తిరస్కరించి అతడికి రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement