ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు మల్టీట్రాకింగ్‌ పనులు | - | Sakshi
Sakshi News home page

ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు మల్టీట్రాకింగ్‌ పనులు

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

కాజీపేట రూరల్‌ : పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ జోన్‌లో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం త్వరలో ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించనుంది. అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట జంక్షన్‌ వరకు 110 కి.మీ. మేర పనులు చేపట్టేందుకు త్వరలో టెండర్‌ పిలవనుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ బుధవారం తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించినట్లు పేర్కొన్నారు. 2029–30 వరకు ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రూ.10,021 కోట్లతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఇండియన్‌ రైల్వే నెట్‌వర్క్‌లో ట్రాక్‌ విస్తరణ 540 కి.మీ, మేర పెంచేందుకు కేంద్రం నిర్ణయించిందని వివరించారు. యాదాద్రి వరకు వచ్చిన 3వ లైన్‌ నిర్మాణం, మల్టీట్రాకింగ్‌లో భాగంగా కాజీపేట–ఘట్‌కేసర్‌ వరకు ఉన్న 2 లైన్ల సామర్థ్యాన్ని 3,4 లైన్లు పెంచునుంది. దీంతో కాజీపేట వరకు నాలుగు లైన్ల నిర్మాణం కానుంది. రవాణ సౌలభ్యం, ఉద్యోగాలు, పర్యాటక అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం ఈ ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట (యాదాద్రి), భువనగిరి బోంగిర్‌కోట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ ప్రాజెక్ట్‌తో ప్రజలు, వ్యాపారులు, పర్యాటక రంగానికి ప్రయోజనం కలగనుంది.

తెలంగాణ రైల్వే అభివృద్ధికి భారీ ఊతం

తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోవడంపై వరంగల్‌ ఎంపీ కడియం కావ్య బుధవారం హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి మల్టీట్రాకింగ్‌ పనులు చేపట్టాలని కోరామన్నారు. ఈ మేరకు ఘట్‌కేసర్‌, కాజీపేట మధ్య 110 కి.మీ. మేర మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పర్యాటక రంగం అభివృద్ధితో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజల తరుఫున ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ కావ్య కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలో ప్రారంభించనున్న

కేంద్ర ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement