వాణిజ్య భవనాల్లో పార్కింగ్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

వాణిజ్య భవనాల్లో పార్కింగ్‌ తప్పనిసరి

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

సెల్లార్లు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం

జిల్లా కేంద్రంలో జఠిలమైన ట్రాఫిక్‌ సమస్య

పలుచోట్ల సెల్లారుల్లో షాపుల ఏర్పాటు

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని పలు వాణిజ్య భవనాల్లో సెల్లార్లు లేవు. కొన్నిచోట్ల సెల్లార్లు ఉన్నప్పటికీ వాటిలో షాపులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. వాణిజ్య భవనాలకు తప్పనిసరిగా పార్కింగ్‌ ఉండాలి. కానీ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారు. దీంతో సెల్లార్లు లేకపోవడంతో రోడ్లపై వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. సెల్లార్లు, పార్కింగ్‌ స్థలాలు లేక ట్రాఫిక్‌ సమస్య తీరడం లేదు.

లక్షకు పైగా జనాభా..

మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డుల్లో 65,712 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధి, చదువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వారితో కలిపి లక్ష జనాభా ఉంటుంది. దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య వెంటాడుతోంది. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో టీపీఓ (టౌన్‌ ప్లానింగ్‌ అధి కారి), ఇద్దరు టీపీఎస్‌లు (టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌ వైజర్లు)ఉన్నారు. టీపీబీఓ (టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఆఫీసర్‌ )పోస్టు ఖాళీగా ఉంది. నలుగురు చైన్‌మెన్‌లు అవుట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్నారు.

ఐదింటికి మాత్రమే..

మానుకోట మున్సిపాలిటీలో కమర్షియల్‌ భవనాల్లో ఐదింటికి మాత్రమే సెల్లార్లు ఉన్నాయని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. కమర్షియల్‌ ప్రాంతాల్లో 500 స్క్వేర్‌ మీటర్ల భవనానికి సెల్లార్‌ అనుమతి తీసుకోవాలి. నాన్‌ కమర్షియల్‌ ప్రాంతాల్లో 750 స్క్వేర్‌ మీటర్ల భవనాలకు సెల్లార్లు ఏర్పాటు చేయాలి. లేకుంటే పార్కింగ్‌కు స్థలం కేటాయించాలి.

షాపుల ఏర్పాటు..

పలు భవనాల సెల్లారుల్లో కాసులకు కక్కుర్తిపడి షాపులు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు పట్టణంలోని నెహ్రూసెంటర్‌లో ఒక షెట్టరు (గది)కు రూ.30,000 నుంచి రూ.50,000 అద్దె ఉంది. దీంతో సెల్లార్‌లను కూడా గదులుగా ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. కమర్షియల్‌ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాల్లో సెల్లార్‌ అనుమతి తీసుకోవడం లేదు. కనీసం పార్కింగ్‌ స్థలం కూడా కేటాయించడం లేదు.

పోలీసులకు తలనొప్పిగా..

పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే నెహ్రూసెంటర్‌తో పాటు పలు సెంటర్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అయితే సెల్లార్‌లు, పార్కింగ్‌ స్థలాలు లేని కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిబంధనలు పాటిస్తేనే ట్రాఫిక్‌ సమస్య గాడిన పడుతుంది.

జఠిలమైన ట్రాఫిక్‌ సమస్య

మానుకోట పట్టణంలో సెల్లార్లు, పార్కింగ్‌ స్థలాలు లేక ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది.

ఇందిరాగాంధీ సెంటర్‌లో కొనసాగుతున్న ఎస్‌బీఐ బ్యాంకు భవనంలోని సెల్లార్‌ను అద్దెకు ఇచ్చారు.

నెహ్రూసెంటర్‌లోని ఓ భవనంలో 20కిపైగా షాపులు ఉండగా.. పైఅంతస్తులో ఎస్‌బీఐ కొనసాగుతోంది. ఆ భవనానికి సెల్లార్‌ లేదు. కనీసం పార్కింగ్‌ స్థలం లేదు.

దాని పక్కన ఉన్న భవనంలో ఇండియన్‌ బ్యాంక్‌ కొనసాగుతుండగా.. అక్కడ సెల్లార్‌ కానీ, పార్కింగ్‌ స్థలం కానీ లేవు.

ఆర్టీసీ బస్టాండ్‌ రోడ్డులో ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ ఉన్న భవనానికి సెల్లార్‌, పార్కింగ్‌ స్థలం లేదు. ఓ షాపింగ్‌ మాల్‌ నిర్వహిస్తున్న భవనానికి కూడా సెల్లార్‌ లేవు.

తొర్రూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద రోడ్డు మధ్యలో వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement