హన్మకొండ కల్చరల్ : వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థికి ప్రజాకవి కాళోజీ–2026 పురస్కారం వరించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 9) కాళోజి జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆయన జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల చేతులమీదుగా వీఆర్ విద్యార్థి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విద్యార్ధి చిన్నప్పటినుంచి కాళోజీకి వ్యక్తిగతంగా దగ్గరివాడిగా, ఆయన అభిమానిగా, మిత్రమండలి సభ్యునిగా, వరవరరావులాంటి ఉగ్రమూర్తుల మిత్రుడిగా ఉన్నారు. కాళోజీ బడిలోనే కవిత్వం ఓనమాలు దిద్దుకున్నారు. యుద్ధంనుంచి శాంతిప్రవాహంలా సాగిన ఆయన కవితాయాత్రలో అలలు, పలకరింత, ఘర్మసముద్రం, మంచుమైదానం, ఖండాంతర , యుద్ధం, తుపాకీ శాంతి, తదితర కవితా సంకలనాలు వెలువరించారు.
విద్యార్థి గురించి..
వీఆర్ విద్యార్థి అసలు పేరు రాములు. పుట్టిన ఊరు వరంగల్‌లోని గవిచర్ల. భారతవైమానిక దళంలో పనిచేస్తున్న క్రమంలో రెండుసార్లు యుద్ధాల్లో పాల్గొన్నారు. అంతకన్నముందు కవిత్వంతో పెనవేసుకుపోతూ విద్యార్ధి కలం పేరుతో తన జీవితాన్ని సాహిత్యంలోకి మలుచుకునే క్రమంలో వీఆర్ విద్యార్థిగా మారారు. ఐదు దశాబ్దాలనుంచి తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు.
ఆయనకు వచ్చిన అవార్డులు..
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం, వానమామలై వరదాచార్య పురస్కారం, వరంగల్ సాంస్కృతిక మండలి వారిచే తెలుగు భాషా విశిష్ట పురస్కారం, దాశరథి– ద్వానా సాహిత్య పురస్కారం, యునైటెడ్ ఫోరం ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారిచే జాషువా పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్నారు.
పలువురి హర్షం..
విద్యార్థికి అవార్డు రావడంపై కేంద్ర సాహిత్య అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, కవులు పొట్లపల్లి శ్రీనివాసరావు, బిల్ల మహేందర్, వల్లంపట్ల నాగేశ్వరరావు, నెల్లుట్ల రమాదేవి, నిధి, రామా చంద్రమౌళి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
సంతోషంగా ఉంది..
ప్రభుత్వం కాళోజీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కాళోజీ ఫౌండేషన్‌కు వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ప్రజలగురించి ప్రజల భాషలో కవిత్వం రాశారు. నగీషిల కవితలు రాయలేదు. పెద్ద ఉపన్యాసాన్ని సైతం కవిత్వంలా మల్చగలగడం కాళోజీ ప్రత్యేకత. వేమనలా నిజాల్ని కవితలలో పొందుపరిచారు. ఆయన జీవితమే ఉద్యమం. – వీఆర్ విద్యార్థి, కవి
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు హైదరాబాద్‌లో ప్రదానం
హర్షం వ్యక్తం చేసిన అంపశయ్య నవీన్, కవులు
వీఆర్ విద్యార్థి


