డబుల్‌ బెడ్రూం ఇళ్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పరిశీలన

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

మరిపెడ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇళ్లను అదనపు కలెక్టర్‌ పురుషోత్తం పరిశీలించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ నరేశ్‌రెడ్డికి సూచించారు. నివాసగృహాల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

రైతులు మంచి ఆదాయం పొందాలి

కొత్తగూడ: రైతులు ప్రణాళికతో పంటలు సాగు చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ఆదాయం పొందాలని రాష్ట్ర పట్టు పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అనసూయ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎకరం పొలంలో మల్బరీ సాగు చేసి పట్టు పురుగుల పెంపకంతో లక్షల్లో ఆదాయం పొందవచ్చన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లు పట్టు ఉత్పత్తి లేదన్నారు. మల్బరీ సాగు వల్ల పంట మా ర్పిడి జరుగుతుందన్నారు. తద్వారా భూమిలో సారం పెరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులకు పట్టు పురుగుల పెంపకంలో శిక్షణ ఇచ్చి, మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం అందే విధంగా చూస్తామని అన్నారు. అనంతరం కేంద్ర స్కిల్‌ బోర్డు కర్నాటక రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్‌ రైతుల సందేహాలను నివృత్తి చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, సెరీకల్చర్‌ అధికారి సురేష్‌, మండల వ్యవసాయాధికారి ఉదయ్‌, ఉద్యానశాఖాధికారి శాంతి ప్రియదర్శిని, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

ఐకేపీ అకౌంటెంట్‌ సస్పెన్షన్‌

బయ్యారం: బయ్యారంలోని ఐకేపీ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శోభపై మంగళవారం సస్పెన్షన్‌ వేటు వేశారు. కార్యాలయంలో జరిగిన జనరల్‌బాడీ సమావేశానికి హాజరైన డీఎంబీ శ్రీకాంత్‌.. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, గ్రామసంఘాలకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇవ్వడంతో పాటు ఇతర లోపాలను గుర్తించారు. ఈ మేరకు అకౌంటెంట్‌ను సస్పెండ్‌ చేశారు.

వినాయక చవితి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి

నెహ్రూసెంటర్‌: వినాయకచవితి వేడుకల్లో భాగంగా మండపాలు, అలంకరణ, నిమజ్జన సమయంలో విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్‌ సూచించారు. పట్టణంలోని గణేశ్‌ మండపాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలపై నిర్వాహకులకు వివరించారు. గణేష్‌ మండపాల్లో విద్యుత్‌ కనెక్షన్లు అధికారికంగా తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ నియమ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈటీ హీరాలాల్‌, ఏఈ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement