● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో వినాయక నిమజ్జనం, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జన ఘాట్ల వద్ద పోలీస్‌శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమస్మాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. రికార్డులు, భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. తనిఖీలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్‌కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సవరణ పారదర్శకంగా జరగాలి
కేసముద్రం: ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెనుగొండ, ఉప్పరపల్లి, కోరుకొండపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఉప్పరపల్లి సమీపంలోని తండాలో కొనసాగుతున్న సమగ్ర భూస ర్వే ప్రక్రియను, సర్వే బృందాలు నిర్వహిస్తున్న రోవర్ల వినియోగం, హద్దుల గుర్తింపును ఆమె పరిశీలించారు. అనంతరం కోరుకొండపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్‌లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, ఎంఈఓ కాలేరు యాదగిరి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


