నేడు తెలంగాణ భాషా
(మాండలిక) దినోత్సవం
15 ఏళ్ల వయస్సు నుంచే ఉద్యమాలు..
1914, సెప్టెంబర్ 9వ తేదీన రంగారావు, రమబాయి దంపతులకు కాళోజీ జన్మించారు. కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. మడికొండలో ప్రాథమిక విద్య, హనుమకొండ, హైదరాబాద్‌ల్లో ఉన్నతవిద్యనభ్యసించారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే రాజకీయ ఉద్యమాలు, కవితా, రచనావ్యాసంగాల్లో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ, నిజాంస్టేట్‌కాంగ్రెస్‌లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్పకవి. షాద్ కలం పేరుతో రచనలు చేసే వారు. రామేశ్వరరావును పెద్దకాళోజీగా పిలిస్తే, నారాయణరావును చిన్న కాళోజీగా పిలిచేవారు. అలాగే, కా ళోజీ సతీమణి రుక్మిణి.. కాళోజీ ఉద్యమాలు, అరెస్ట్‌లు నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నారు.
సందర్భానికి స్పందించి రాసే రచయిత కాళోజీ..
కాళోజీ జీవితం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరి గిన స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తెలంగాణతో ముడిపడి ఉంది. ఉద్యమకార్యాచరణలో స్పందించే అవసరం ఏర్పడినప్పుడు కాళోజీ తన కవితల ద్వారా విజృంభించారు. కాళోజీ కవితలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగానే ఉండేవి. 1942లో నిజాం రాష్ట్రంలో తెలుగు ప్రజలు తమ మాతృభాషైన తెలుగుపై నిరాదరణతో ఉండడం చూసి స్పందించి, ఏ భాషరా నీది యేమి వేషమురా? /ఈ భాష ఈవేష మెవరి కోసమురా?/ ఆంగ్లమందున మాటలాడ గలుగగనే/ ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?/ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు. 1944లో జనగామ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను నిరసిస్తూ నవయుగంబున నాజీవృత్తుల/ నగ్న నృత్య మింకెన్నాళ్లు? / పోలీసు అండను దౌర్జన్యాలు/ పోషణబొందె దెన్నాళ్లు? / దమననీతిలో దౌర్జన్యాలకు/ దాగిలిమూతలు ఎన్నాళ్లు? / కంచెయె చేనును మేయుచుండగా / కాంచకుండుటింకెన్నాళ్లు ? అంటూ ప్రశ్నించారు. 1946లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు, ప్రజాసంస్థపై పగసాధించిన/ ఫలితం తప్పక బయటపడున్ / నిక్కుచునీల్గే నిరంకుశత్వము/ నిల్వలేక నేలను గూలున్ / చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను / స్థిరమగు కట్టయు శిధిలగున్ / .. అంటూ హెచ్చరించారు. 1946లోనే వరంగల్ కోటలో మొగిలయ్య హత్య జరిగింది. మరొకచోట బాలున్ని పొడిచారు. శిక్ష చంపిన వారికి వేయాల్సిందిపోయి జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలల పాటు దేశబహిష్కరణ శిక్షవిధించారు. ఈ సందర్భంగా ఇక్కడి ఘటనలపై విచారణ చేయాడానికి వచ్చిన ప్రధాని సర్ మీర్జాఇస్మాయిల్‌ను కాళోజీ తన కవితద్వారా ప్రశ్నించారు.
కాళోజీ తెలంగాణ మాండలికంలోనే తన కవితలు, ధిక్కారస్వరం వినిపించేవారు. ఏటా కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవంగా జరుపుకోవాలని 2014, సెప్టెంబర్ 9న నిట్ వరంగల్‌లో జరిగిన నారాయణరావు 100వ జయంతి సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఆయనది ఉద్యమాలతో ముడిపడిన జీవితం
నిరంతరం పోరాటాల బాటే.. నేడు ప్రజాకవి జయంతి
హన్మకొండ కల్చరల్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు.. ధిక్కార స్వరానికి మారుపేరు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తొలి, మలిదశల్లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో ఆయన జీవితం పెనవేసుకుంది. జీవించి ఉన్న కాలంలో ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఎలా పాలుపంచుకున్నారో చనిపోయిన తర్వాత కూడా ఆయన భావాలు ప్రజాస్వామ్యవాదులు, కళాకారులకు స్ఫూర్తిని అందించాయి. తన భావాలకే కాదు శరీరానికీ మరణంలేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. ఈ క్రమంలో నేడు( బుధవారం) ప్రజాకవి జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం). ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం


