ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్ పర్సన్ ఎర్రప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న అమావాస్య, 12, 13 వారాంతం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా (ప్రభుత్వ సెలవు) సెలవు ఉంటుందన్నారు. మార్కెట్ తిరిగి 15వ తేదీన పునః ప్రారంభమవుతుందన్నారు. రైతులు దీనిని గమనించాలని కోరారు. సెలవుల్లో మార్కెట్‌కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దని చైర్ పర్సన్ పేర్కొన్నారు.
16న డాక్ అదాలత్
ఖిలా వరంగల్: వరంగల్ డివిజన్ తపాలాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 16న ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
లైంగికదాడి
నిందితుడి అరెస్ట్
మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం భూపాలపల్లి మండలం రాజీవ్‌నగర్ గ్రామానికి చెందిన కురుసం రమేశ్.. మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం నిందితుడు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.
మంత్రి సీతక్కను కలిసిన ‘కుడా’ చైర్‌పర్సన్
నయీంనగర్: హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంగళవారం ‘కుడా’ చైర్ పర్సన్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ‘కుడా’ చైర్ పర్సన్ సుధారాణికి మంత్రి, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.


