జనగామ: జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన గర్భిణి శ్రావణి మగ శిశువుకు జన్మనివ్వగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఎంసీహెచ్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృత శిశువు తండ్రి ఆరెళ్ల సురేశ్ విలేకరులతో మాట్లాడారు. ప్రసవం కోసం తన భార్య శ్రావణిని శనివారం ఎంసీహెచ్‌లో చేర్పించామన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా మగ శిశువు జన్మించారన్నారు. అనంతరం శిశువు గుండె స్పందన తక్కువగా ఉందని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం తరలించారన్నారు. ఎంజీఎం వైద్యులు శిశువును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. అయితే శిశువు మృతికి వైద్యల నిర్ల్యక్షమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం ఎంసీహెచ్ వద్ద నిరసన తెలిపారు. శిశువు పుట్టిన సమయంలో తమకు సరిగా సమాచారం ఇవ్వలేదని, ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజీని చూపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జనగామ సీఐ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు..
శిశువు మృతికి సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం లేదని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. తల్లి గర్భంలోనే శిశువు మెడకు పేగులు చుట్టుకోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శస్త్ర చికిత్స చేసి శిశువును రక్షించేందుకు వైద్యులు ప్రయత్నించారని చెప్పారు. పుట్టిన తర్వాత శిశువుకు శ్వాస అందకపోవడంతో సీపీఆర్ చేసి, బాక్స్‌లో ఉంచి కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్‌లో ఎంజీఎంకు తక్షణమే తరలించినట్లు వివరించారు. పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందాడని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం అనే ఆరోపణల్లో వాస్తవం లేదని, కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యం చేశారంటూ ఎంసీహెచ్ ఎదుట కుటుంబీకుల ఆందోళన


