కేసముద్రం: రాష్ట్ర రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సోమవారం కేసముద్రం రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్‌లో నూతనంగా నిర్మించిన కేసముద్రం–2 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించేందుకు, నారాయణపురం గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందించేందుకు, మున్సిపాలిటి కార్యాలయం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కాగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో సభాప్రాంగణం ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శాంతి భద్రతల
పరిరక్షణే లక్ష్యం
గూడూరు: ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుగా శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కేసుల రిజిస్టర్లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడేందుకు, నేరాల నియంత్రణ, నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో సీఐ వినయ్‌కుమార్, ఎస్సై రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు అప్పరాజ్‌పల్లి వాసి
గూడూరు: సెప్టెంబర్ 10, 11 తేదీల్లో స్పెయిన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు.. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మండలంలోని అప్పరాజ్‌పల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ధారావత్ మోహన్‌నాయక్‌కు ఆహ్వానం అందినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ మాట్రిడ్ గెటాఫే క్యాంపస్‌లో జరిగే ఈ సదస్సులో మోహన్‌నాయక్ శ్రీకులం, వలసలు, అసమానతలు : ప్రపంచ వ్యాప్తంగా కుల వ్యవస్థ కొనసాగింపు, కుల వ్యతిరేక ఉద్యమాలుశ్రీ అనే అంశంపై ప్రసంగించనున్నట్లు తెలిపారు. ప్రయాణం, ఆతిథ్యం ఖర్చుల నిమిత్తం మాట్రిడ్ విశ్వవిద్యాలయమే ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేసినట్లు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైమ్ బోధన సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆర్సీఓ నారాయణనాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేఎల్ మ్యాథ్స్–1, జేఎల్ కామర్స్–01, పీజీటీ బయోసైన్స్–1, పీజీటీ ఫిజికల్ సైన్స్ (మహిళ) –2, డీఎల్ కంప్యూటర్ సైన్స్ –1 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పీజీ, పీహెచ్‌డీ, సెట్, బీఈడీ నెట్ అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో సంప్రదించాలని సూచించారు. అక్కడే దరఖాస్తులు స్వీకరించి అదే రోజే డెమోను నిర్వహిస్తామని ఇతర వివరాలకు 73829 31512, 79010 99787 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
రేపటి ప్రజావాణి రద్దు
మహబూబాబాద్: ఈనెల 31న కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహశబరీష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం అత్యవసర సమావేశం జరుగనుందని తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు గమనించి కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలకు రావొద్దని కోరారు. జిల్లాలో మిగితా అన్ని చోట్లా యథావిధిగా ప్రజావాణి కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.


