మహబూబాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సివిల్ సప్లయీస్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 15న పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఈ కార్డుల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. కానీ పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. దీనికి తోడు పలు కార్డుల్లో లబ్ధిదారుల వివరాలు, అడ్రెస్ తప్పుగా ప్రింట్ అయింది. తప్పుల సవరణ ఎలా చేసుకోవాలనే విషయంలో లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. అధికారుల వద్ద కూడా సమాచారం లేకపోవడంతో వారు కూడా స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
18 మండలాలు.. 558 రేషన్‌షాపులు
జిల్లాలోని 18 మండలాలకు మొత్తం 558 రేషన్ షా పులు ఉన్నాయి. ఈ– పాస్ మిషన్‌ల ద్వారా ఐరిస్, బయోమెట్రిక్, ఓటీపీల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్‌షాపులకు బియ్యం సరఫరా చేస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ప్రతీ నెల బియ్యం కోటాను కేటాయిస్తున్నారు.
2,78,379 కార్డుల సరఫరా
జిల్లాలో మొత్తం 2,79,039 కార్డులకు గాను 2,78,379 కార్డులు సరఫరా చేశారు. తహసీల్దార్లకు కార్డుల పంపిణీ బాధ్యత అప్పగించారు. వారు జీపీఓలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల ద్వారా కార్డుల పంపిణీ చేపట్టాలి, కానీ మానుకోట మున్సిపాలిటీలో నక్షా ప్రాజెక్ట్ నేపథ్యంలో డీలర్లకే పంపిణీ బాధ్యత అప్పగించారు. దీంతో కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతుంది.
వివరాల్లో తప్పుల ముద్రణ
పలు కార్డుల్లో పేర్లు ఇతర్రా తప్పులు ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. వాటిని ఏవిధంగా సవరణ చేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత కార్యాలయాలకు వెళ్తే గైడ్స్‌లైన్స్ రాలేదని అధికారులు సమాధానమిస్తున్నారు.
కార్డు ఎలా పని చేస్తుందో..?
ప్రస్తుతం ఐరిస్, బయోమెట్రిక్, ఓటీపీల పద్ధతిలో రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నందున.. ఈకార్డులు ఎలా పనిచేస్తాయనే ఆలోచన లబ్ధిదారుల్లో మొదలైంది. ఈ –పాస్ మిషన్ల బదులు వేరే మిషన్లు వస్తాయా.. అనే సందేహలు వ్యక్తం చేస్తున్నారు. ఈ–పాస్ మిషన్ టెండర్ కాలపరిమితి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నారని పలువురు రేషన్ డీలర్లు చెబుతున్నారు.
యాప్‌తో వివరాలు
టీ రేషన్ యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయని, స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే కార్డుకు కేటాయించిన రేషన్ ఇతరత్రా అన్నివివరాలు తెలుస్తాయని డీసీఎస్‌ఓ కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. ఏటీఎం కార్డు మాదిరిగా ఉండటంతో ఆకార్డు పని తీరు ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి లబ్డిదారులు ఆసక్తి చూపుతున్నారు. రేషన్ ప్రధానంగా దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఆగష్టు మాసంలోనే మూడు నెలల బియ్యం పంపిణీ చేయడంతో మళ్లీ పంపిణీకి చాలా సమయం ఉండడంతో ఆలోపు గైడ్ లైన్స్ రూపొందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కార్డులపై తప్పుగా వివరాల ముద్రణ
మండలాల వారీగా తహసీల్దార్లకు కార్డుల అప్పగింత
మున్సిపాలిటీల్లో పంపిణీలో తీవ్రజాప్యం
కార్డులు పనితీరు.. సవరణపై సందేహలు


