విలీన దడ! | - | Sakshi
Sakshi News home page

విలీన దడ!

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

వరంగల్‌ అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కాలేజీలను స్కిల్‌ హ్యుమన్‌ క్యాపిటల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇన్సియేటివ్స్‌(శక్తి)లో విలీనం చేయాలనే ప్రభుత్వ జీఓ జారీపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. భవిష్యత్‌పై భయాందోళన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి వారం రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది సైతం కదం తొక్కారు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ తర్వాత నేరుగా ఇంజనీరింగ్‌ సెకండియర్‌లో జాయిన్‌ అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. కావాలని కొంత మంది మిస్‌ గైడ్‌ చేస్తున్నారని, అవేమీ పట్టించుకోవద్దని, సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విధానంపై స్పష్టత ఉందని ప్రకటించారు. అయినప్పటికీ అధ్యాపకులు, విద్యార్థుల్లో నమ్మకం కలగడం లేదనే వాదనలున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది..

తెలంగాణ వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు పాలి టెక్నిక్‌ విద్యను అభ్యసిస్తుండగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో సుమారు 10వేల మంది జాయిన్‌ అవుతున్నారు. పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిసెట్‌ రాసి పాలిటెక్నిక్‌లోని 28 కోర్సుల్లో జాయిన్‌ అవుతున్నారు. వరంగల్‌లోని బాలుర, బాలిక కళాశాలల్లో సూమారు 2,500మంది, స్టేషన్‌ఘన్‌పూర్‌, పరకాల, కాటారం, మానుకోటలో మిగిలిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌కు పరిమితం చేయడమేనా?

ప్రభుత్వం ఇటీవల శక్తి స్కీమ్‌ను తీసుకొస్తూ పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేస్తూ జారీ చేసిన జీఓ 97 దుమారం రేపుతోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను ఒక గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు పాలిటెక్నిక్‌, ఐటీఐ తదితర కోర్సుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్‌ విద్యను తీసుకురావడం వల్ల మూడేళ్ల శ్రమ వృథా అవుతుందని పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఓ 97ను తక్షణమే రద్దు చేయాలని గొంతెత్తుతున్నారు. ప్రభుత్వ, పబ్లిక్‌, పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌లో ఈ వ్యవస్థను నిర్వహించడం అంటే నిర్వీర్యం చేయడమేనని విద్యార్థుల్లో బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడమేనని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉచితంగా అందించాల్సిన విద్యను పీపీపీ మోడల్‌లో నడిచే వర్సిటీకి అప్పగిస్తే భవిష్యత్‌లో ఫీజుల భారం ఇష్టారాజ్యంగా పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేకనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులను ప్రైవేట్‌ వర్సి టీల వైపు నెట్టేస్తున్నారని మదన పడుతున్నారు. గతంలో మాదిరిగా పాలిటెక్నిక్‌ విద్య పూర్తి కాగానే ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో (లేటర్‌ విద్య)లోకి ప్రవేశించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విలీనం వల్ల సదుపాయం కోల్పో యి, ఇంజనీరింగ్‌ చేయాలంటే మరో రెండేళ్లు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, ఇంజినీరింగ్‌లో చేరాల్సి ఉంటుందని గుబులు పట్టుకుంది. అంతేకాకుండా, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులను స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌కు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం పాలిటెక్నిక్‌ విద్యకు ప్రతిబంధకంగా మారి, భవిష్యత్‌కు తీవ్ర అంధకారంగా మారిన శక్తిలోకి మార్చే ఆలోచనను విరమించుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట నిరసన

కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం 97 జీఓను తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని గురువారం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట డీఎస్‌ఏ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డీఎస్‌ఏ రాష్ట్ర కన్వీనర్‌ కామగోని శ్రావణ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సిటీకి పాలిటెక్నిక్‌ విద్యార్థులను అనుసంధానం చేయడం సిగ్గుచేటన్నారు. నాయకులు శివ, కమల్‌, జాషువా, వెంకటేష్‌, సంపత్‌, సుమన్‌, గోవర్దన్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బంద్‌..

మండల పరిధిలోని పాలిటెక్నిక్‌ కాలేజీని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం బంద్‌ చేశా రు . ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు మాట్లాడుతూ.. 97 జీఓ పేరుతో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని విమర్శించారు. నాయకులు సింహాద్రి, మహేష్‌, విక్రం, నందీశ్వర్‌, పవన్‌ పాల్గొన్నారు.

స్కిల్‌ వర్సిటీలో ‘పాలిటెక్నిక్‌’ విలీనంపై భయాందోళన

3 ఏళ్ల విద్య వృథా అవుతుందని

రోడ్డెక్కిన విద్యార్థులు

మంత్రి వివేక్‌ హామీపై విద్యార్థుల్లో

అనుమానాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement