మహబూబాబాద్ రూరల్ : మానుకోట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల హక్కు అయిన ‘ఇజ్జత్ పాస్’ విధానాన్ని పునరుద్ధరించాలని ఎంపీ పోరిక బలరాంనాయక్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో రైల్వే శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇజ్జత్ పాస్ విధానాన్ని బీజేపీ సర్కారు అన్యాయంగా ఎత్తివేసిందన్నారు. మానుకోట పార్లమెంట్ పరిధిలోని గిరిజన, ఆదివాసీ, సామాన్య ప్రజలు, పేద గిరిజనులకు, కూలీల రైల్వే ప్రయాణ సౌకర్యాల కోసం ఇజ్జత్ పాస్ ఉపయోగపడుతుందని తెలిపారు. తాను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితిని గమనించి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు గుర్తుచేశారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇజ్జత్ పాసులను తక్షణమే పునరుద్ధరించాలని, చారిత్రక డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆధునికీకరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు జంగిలిగొండ ఎంపిక
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) అమలులో భాగంగా మహబూబాబాద్ మండలంలోని జంగిలిగొండ గ్రామ పంచాయతీ జిల్లా నుంచి పైలట్ జీపీగా ఎంపికై ంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ)లో శుక్రవారం నిర్వహించే శిక్షణ తరగతులకు జంగిలిగొండ సర్పంచ్ గుండెల రేణుకకు ఆహ్వానం అందింది. గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, పర్యావరణం, ఉపాధి, జీవనోపాధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతులు, సుపరిపాలన తదితర రంగాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జీపీడీపీ ప్రధాన ఉద్దేశం. ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలో అందుబాటులో ఉన్న వనరులు, ప్రజల అవసరాలు, సమస్యలు, అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది. గ్రామంలోని వనరులను సమర్థంగా వినియోగించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రభు త్వ పథకాలను అర్హులైన వారికి చేరవేయడం, పారదర్శకమైన పాలన అందించడం వంటి అంశాలకు ప్రణాళికలో ప్రాధాన్యం ఉంటుంది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్, డీపీఓ రేవంత్, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు, గ్రామస్తులకు సర్పంచ్ గుండెల రేణుక కృతజ్ఞతలు తెలిపారు.
రైస్ మిల్లులో తనిఖీలు
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్ సమీపంలోని మహదేవ రైస్ ఇండస్ట్రీస్‌లో గురువారం సివిల్ సప్లయీస్ అధికారులు తనిఖీలు చేసినట్లు డీఎస్‌ఓ రమేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంఆర్ బకాయిలు ఉండడంతో, సివిల్ సప్లయీస్ డీటీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రికవరీ కోసం తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు.


