● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
మహబూబాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ఎస్టీలకు సంబంఽధించిన భూసమస్యలు, ఉద్యోగుల పదోన్నతులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. మంజూరైన నిధులను ఎస్సీ, ఎస్టీ అవాసాలకు ఖర్చు చేయకపోతే ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కేసుల దర్యాప్తు, బాధితులకు న్యాయం, పరిహారం అందించడం వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దన్నారు. ప్రమోషన్లు, రిజర్వేషన్ నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులకు భంగం కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. అత్యాచార తదితర సంఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


