మహబూబాబాద్ రూరల్ : సెప్టెంబర్ 12న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్‌కు ప్రాసిక్యూషన్ తరఫున తగిన సహకారం అందించి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా తోడ్పడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదేని ఒక కేసులో నేరం రాజీపడదగినది కాకపోయినప్పటికీ.. ఇరుపక్షాలు రాజీపడినట్లయితే పరిష్కరించేలా చూడాలన్నారు. లోక్ అదాలత్ అంతిమ ధ్యేయం ఇరు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం కలిగించడమేనని, దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తోడ్పాటు అందించాలని కోరా రు. ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కొంపెల్లి వెంకటయ్య, జయలత తదితరులు పాల్గొన్నారు.
కోర్టు పనులు వేగవంతం చేయాలి
మరిపెడ రూరల్ : మరిపెడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జూనియర్ సివిల్ కోర్టు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా జడ్జి మురళీమోహన్ ఆదేశించారు. గురువారం అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్వహణకు అవసరమైన వసతులు, ఇతర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్జి మురళీమోహన్ మాట్లాడుతూ.. కోర్టు పనులు త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనులను అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా పీపీ కొంపెల్లి వెంకటయ్య, కోర్టు ఏఓ శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది భూక్య శ్రీనివాస్, మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి, స్థానిక న్యాయవాదులు బానోతు లాలునాయక్, లింగాల శ్రీనివాస్, తేజావత్ శారదరవీందర్ నాయక్, సైదులు, మామిడాల మునేష్, మరిపెడ సీఐ పవన్‌కుమార్, ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొన్నారు.


