ఇంటి దొంగలు | - | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగలు

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

సాక్షి, మహబూబాబాద్‌: బ్యాంకుల్లో తనఖాపెట్టిన బంగారం, ఖాతాల్లో డబ్బులకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల జిల్లాలోని పలు బ్యాంకుల్లో పలువురి ఖాతాల్లో డబ్బులు మాయం కావడం, నిబంధనలకు విరుద్ధంగా రుణాల పంపిణీ, తనఖాపెట్టిన బంగారం మాయంకావడం వంటి ఘటనలతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

వరుస సంఘటనలు..

నాలుగైదు నెలల్లో జిల్లాలోని పలు బ్యాంకుల్లో జరిగిన సంఘటనలతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మహబూబాబాద్‌ పట్టణంలోని ఓ బ్యాంకులో ఖాతాదారులు తనఖాపెట్టిన రూ. 91లక్షల విలువచేసే బంగారం బ్యాంకులో కీలక ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసుకెళ్లాడు. మరో గోల్డ్‌లోన్‌ బ్రాంచ్‌లో తనఖా పెట్టాడు. అక్కడి నుంచి సదరు వ్యక్తి తన అనుచరుల ఖాతాలోకి డబ్బులు బదిలీ చేశాడు. ఈవిషయం బయటకు పొక్కడంసంబంధిత ఉద్యోగిపై బ్రాంచ్‌ మేనేజన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జిల్లాలోని ఓ పుణ్యక్షేత్రంలో నిల్వ ఉన్న డబ్బులు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. అందులో నుంచి బ్యాంకులో పనిచేసే కీలక ఉద్యోగి కోట్ల రూపాయలు తమ అనుచరుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం ఈఓ బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా ఖాతాలో ఉండాల్సిన డబ్బులు వేరే వారి ఖాతాలోకి జమచేసినట్లు తేలింది. దీంతో సదరు ఉద్యోగిపై కేసు నమోదు చేసి రికవరీ చేయించిన సంఘటన చర్చనీయాంశమైంది. అదే విధంగా జిల్లాలోని ఓ మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి బ్యాంకులోని డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకోవడం, ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసిన విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారి పసిగట్టారు. ఆ ఉద్యోగిపై కేసు నమోదు చేయగా.. విచారణ జరిపి సదరు ఉద్యోగిని జైలుకు పంపించారు. వీటితో పాటు జిల్లాలోని పలు బ్యాంకుల్లో కూడా డబ్బుల దుర్వినియోగం చేసిన విషయంపై పలువురిపై ఫిర్యాదులు ఉన్నాయి.

నగదు దుర్వినియోగం

ఆ శాఖ పరిధిలో ఉంటుంది

బ్యాంకుల్లో తనఖాపెట్టిన బంగారం, డిపాజిట్‌ చేసిన డబ్బులు దారి మళ్లించడం నేరం. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. రికవరీ, చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ పథకాల దుర్వినియోగం, నిజమైన లబ్ధిదారులను ఇబ్బంది పెట్టిన విషయాలపై చర్యల కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.

– యాదగిరి, లీడ్‌బ్యాంకు మేనేజర్‌

బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం

పక్కదారి

పలువురి అకౌంట్లల్లో విరుద్ధంగా

రుణాల పంపిణీ

వరుస సంఘటనలతో ఖాతాదారుల ఆందోళన

బ్యాంకు ఉద్యోగులపై ఆరోపణలు

గతంలో బ్యాంకు ఉద్యోగులు అంటే నిక్కాసుగా వ్యవహరిస్తారు అనే పేరు ఉండేది. కానీ, ఇటీవల జరిగిన సంఘటనలతో వారు కూడా గాడి తప్పుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలోని మహిళా సంఘాలకు రుణాలు అందజేయడం, ఒక బ్యాంకులో లోను ఉన్నా... ఆ సంఘాల సభ్యులకు తెలియకుండా మరో బ్యాంకులో లోన్లు ఇవ్వడంపై చర్చ జరిగింది. అయితే విషయం తెలుసుకున్న సభ్యులు సంఘం నిర్వాహకులను నిలదీయం, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంపై జిల్లాలో చర్చ జరిగింది. అదేవిధంగా జిల్లాలోని వ్యవసాయ రుణాల పంపిణీ, రెన్యూవల్స్‌ సందర్భంలో కొందరు బ్యాంకు మేనేజర్లు ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వారు చెప్పిన వారికే రుణాలు ఇవ్వడం, ఇందుకోసం వారి వద్ద నుంచి కమీషన్లు తీసుకోవడం, ఇన్సూరెన్స్‌ పేరుతో అధికంగా డబ్బులు వసూళ్లు చేసినట్లు విమర్శలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement