రేపు అష్టోత్తర శతకలశ కుంభాభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

రేపు అష్టోత్తర శతకలశ కుంభాభిషేకాలు

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నివారణ, అన్నదాత కష్టాలు తీరాలని కోరుతూ జిల్లా పరిధిలోని 18 మండలాల్లోని 115 దేవాలయాల్లో మంగళవారం అష్టోత్తర శతకలశ కుంభాభిషేకాలు జరపాలని నిర్ణయించారు. గ్రామప్రజల ఆధ్వర్యంలో అష్టోత్తర శతకలశ (108) కుంభాభిషేకాలు, పూజలు చేయాలని డీడీఎన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్‌ వాసుదేవశర్మ ఆదివారం సూచించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుడి ఆశీస్సులు పొందాలని జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, లక్ష్మీనరసింహాచార్యులు, చక్రధరాచార్యులు పేర్కొన్నారు. అదే విధంగా ఈ నెల 26న 115 మంది డీడీఎన్‌ అర్చకుల ఆధ్వర్యంలో అనంతాద్రి దేవాలయంలో మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని దేవాలయ ట్రస్టీ నూకల రాంచంద్రారెడ్డి, సభ్యులు నాయిని ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.

పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా రంజిత్‌కుమార్‌

మహబూబాబాద్‌: తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నాగవెల్లి రంజిత్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. టీఎన్జీఓఎస్‌ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్‌ అధ్యక్షత ఎన్నికలు జరగగా.. ఎన్నికల ఆఫీసర్లుగా వెంకటేశ్వర్లు, మున్వర్‌బేగ్‌, రిటర్నింగ్‌ అధికారిగా రోహిత్‌ వ్యవహరించారు. ఎన్నికల్లో మూడోసారి ఫోరం జిల్లా అధ్యక్షుడిగా రంజిత్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోలిపాక భరత్‌, కోశాధికారిగా సాదుల మనోజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, అసోసియేట్‌ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.

కోడిపుంజుకు కమ్మలు.. ముత్యాలమ్మకు మొక్కులు

కేసముద్రం: కోడిపుంజుకు కమ్మలు కుట్టించి, మెడలో మద్యం బాటిల్‌ వేసి ముత్యాలమ్మకు ఓ భక్తుడు వినూత్న రీతిలో తన మొక్కు చెల్లించుకున్నాడు. కేసముద్రంస్టేషన్‌లో ఆదివారం బోనాల పండుగ జరిగింది. గ్రామానికి చెందిన తోడిటి వెంకన్న అనే వ్యక్తి తన కోడిపుంజుకు కమ్మలు కుట్టించి, మెడలో మద్యం సీసా వేసి, మేళతాళాల నడుమ ఆ కోడిపుంజును తీసుకెళ్లి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాడు. ఈ దృశ్యాన్ని భక్తులంతా ఆసక్తిగా తిలకిస్తూ, సెల్ఫీలు దిగారు.

బిల్ల మహేందర్‌కు సాహితీ పురస్కారం అందజేత

విద్యారణ్యపురి: హనుమకొండలోని పీఆర్‌రెడ్డి భవన్‌లో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఒద్దిరాజు సోదరుల స్మృత్యర్థం కవి బిల్లా మహేందర్‌ రచించిన ఉత్తమ కవితా సంపుటి ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ పుస్తకాన్ని సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి చేతుల మీదుగా బిల్లా మహేందర్‌కు రూ.10 వేల నగదు పురస్కారం అందించి సత్కరించారు. బాధ్యులు గండ్ర లక్ష్మణ్‌రావు, కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య పుస్తకాన్ని సమీక్షించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి మాట్లాడుతూ.. తాను మంచి పాఠకురాలినని, ప్రజలకు మేలు చేసే కవిత్వం బిల్లా మహేందర్‌ రాస్తున్నారని అభినందించారు. కాగా, ఇదే కార్యక్రమంలో మైక్రో ఆర్టిస్టు మట్టెవాడ అజయ్‌ని నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సహృదయ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌వీఎన్‌ చారి నిర్వహించగా, సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహర్‌బాబు అధ్యక్షత వహించారు. సహృదయ సాంస్కృతిక సంస్థ బాధ్యులు, కవులు పొట్లపెల్లి ఒద్దిరాజు, రఘురావు, ఏవీ నర్సింహారావు, లక్ష్మణ్‌రావు, సీత వెంకట్‌, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement