మట్టి నమూనాల సేకరణ..
సీఆర్పీల పాత్ర కీలకం..
మహబూబాబాద్ రూరల్ : ఘన జీవామృతం, పంచగవ్య, సీతాఫల ఆకులు, వేప గింజల కషాయం వంటి ప్రకృతి వ్యవసాయంతో రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించవచ్చు. నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. పశువుల ఆధారిత వనరులు, జీవ పదార్థాలు, వ్యవసాయ అవశేషాలు తదితరాలను వినియోగించడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుంది.
రైతులకు శిక్షణ, అవగాహన..
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ నిర్వహణలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం, క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే ముందు తమ ప్రాంతానికి అనుకూలమైన పంటలు, సా గు విధానాలు, నేల పరిస్థితులు తదితర అంశాలపై వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.
ప్రకృతి వ్యవసాయ ద్రావణాల తయారీపై శిక్షణ
ప్రకృతి వ్యవసాయంలో రైతులు తమ పొలాల్లోనే సులభంగా తయారు చేసుకుని వినియోగించుకోగ ల వివిధ సహజ ఇన్‌పుట్ల తయారీ విధానాలపై రై తులు, సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఘన జీవామృతం, పంచగవ్య, సీతాఫల ఆకుల కషా యం, వేప గింజల కషాయం వంటి ప్రకృతి వ్యవసాయ ఇన్ పుట్ల తయారీ విధానం, వాటి ఉపయోగాలు, పంటలకు వినియోగించే విధానం తదితర అంశాలను ప్రాయోగికంగా వివరించారు. ఘన జీ వామృతం ద్వారా నేలలో జీవసారం, సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరచడం, పంచగవ్యను పంటల పెరుగుదలకు అనుకూలంగా వినియోగించడం, సీతాఫల ఆకులు, వేప గింజల ఆధారిత కషాయాలను సహజ పంట సంరక్షణలో వినియోగించే విధానాలపై అవగాహన కల్పించారు.
రసాయన రహిత సాగుతో
నేలకు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ,
రైతులకు ప్రయోజనాలు
నాణ్యమైన పంట..
ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యం
ప్రతి క్లస్టర్లో సుమారు 125 మంది రైతులతో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేసి, వారి పొలాల నుంచి శాసీ్త్రయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరించేలా కార్యాచరణ చేపట్టనున్నారు. సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించి నేలలోని పోషక స్థాయిలు, నేల ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలను గుర్తించి, పంటల సాగుకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించనున్నారు.
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) కీలకంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల పరిధిలో పనిచేస్తున్న సీఆర్పీలకు అవసరమైన శిక్షణ అందించి, రైతులతో సమన్వయం చేయడం, మట్టి నమూనాల సేకరణకు రైతులను సిద్ధం చేయడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించనున్నారు.


