ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల (గ్రామీణ రహదారుల) అభివృద్ధి పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి కలెక్టరేట్‌కు చేరుకొని రూ.868 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల మరో పైలాన్‌ను ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కలెక్టరేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం అంతా కలియదిరిగి పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో ఆసీనులు చేసి శాలువా కప్పారు. నూతన కలెక్టరేట్ పక్కన ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు భవనాలు నిర్మించడంతోపాటు మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రూప్ ఫొటో దిగారు.


