ములుగు రూరల్/ఎస్‌ఎస్ తాడ్వాయి : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు మేడారం చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కాన్వాయ్‌లో గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కు సమ్మక్క–సారలమ్మ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలి వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవార్ల సన్నిధిలో సీఎం ఎత్తు బంగారం (బెల్లం) తులాభారం వేశారు. ఎత్తుబంగారం, పసుపు, కుంకుమ, చీరసారెలతో అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లులకు చీరసారె, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. అనంతరం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సీఎం రేవంత్‌రెడ్డికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, ప్రసాదం అందించి ఆశీర్వచనం అందించారు. మంత్రి సీతక్క.. సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. తల్లుల గద్దెల నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి కరచాలనం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి మొక్క నాటారు. ప్రధాన ఆర్చ్ ద్వారం పక్కన ఏర్పాటు చేసిన జలప్రసాదం (మినరల్ వాటర్ ప్లాంట్)ను ప్రారంభించారు. పలువురికి చేయూత, సామాజిక భద్రత పింఛన్ల చెక్కులు అందించారు.
ఆదివాసీ చిత్రాల పరిశీలన
మేడారం మహాజాతరలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈమేరకు పూజల అనంతరం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్కతో కలిసి ఆదివాసీ చరిత్రకు సంబంధించిన సాండ్ స్టోన్‌పై చెక్కిన ఆదివాసీ బొమ్మలను పరిశీలించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం
హెలిపాడ్ వద్ద మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం పర్యటనలో ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళీనాయక్, మామిడాల యశస్వినిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ సీఎం దివ్యదేవరాజన్, మేడారం ఈఓ వీరస్వామి ఉన్నారు.
ఎత్తు బంగారం సమర్పణ
మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ
మేడారంలో గంటపాటు సీఎం పర్యటన


