చెరువులో పడి పశువుల కాపరి..
మల్హర్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ పశువుల కాపరి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ పరిధి దబ్బగట్టులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజమల్లు (55) పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దబ్బగట్టు శివారులో చెరువు వద్దకు పశువులను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం పశువులను తీసుకెళ్లడానికి చెరువు వద్దకు వెళ్లగా అక్కడ పెద్ద గుంతలోని నీటిలో జారిపడ్డాడు. గమనించిన స్థానికులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించి రాజమల్లు మృతదేహాన్ని బయటకు తీశారు.
వ్యవసాయ బావిలో పడి రైతు..
భీమదేవరపల్లి : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ధర్మారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోపగోని వెంకటయ్య (63) శనివారం తన వ్యవసాయ బావిలో క్రేన్, కూలీల సాయంతో పూడికతీత పనులు చేయిస్తున్నాడు. సాయంత్రం పనులు ముగిసిన తర్వాత వెంకటయ్య, అతడి కుమారులు, కూలీలు బావి వద్దే ఉన్నారు. అదే సమయంలో వెంకటయ్య బావి అంచున ఉన్న స్టార్టర్ వైర్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అదే బావిలో పడిపోయాడు. గమనించిన కుమారులు, కూలీలు వెంటనే క్రేన్ సహాయంతో అతడిని బయటికి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యకు వెంటనే ముల్కనూరులోని ఓ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తీసుకు వస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మల్హర్ మండలంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ పశువుల కాపరి, భీమదేవరపల్లి మండలంలో ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


