ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విదితమే. ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం హనుమకొండలోని జులైవాడలో గల సొంతింటికి ఆమె భౌతికకాయం చేరుకుంది. సురేఖ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. కుమారుడు, భర్తను కోల్పోయిన కొద్దినెలల్లోనే ఆమె సైతం దూరం కావడంతో కుటుంబం వరుస విషాదాలతో కుంగిపోయింది.
క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం..
డీఎంఓ సురేఖ అంత్యక్రియలను పెద్దమ్మగడ్డలో క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ప్రార్థనల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, అధికారులు అశ్రునయనాల మధ్య ఆమె మృతదేహాన్ని సమాధి చేశారు.
కడసారి చూపు..
డీఎంఓ మృతదేహాన్ని చూసేందుకు మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు, జేడీఎం మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఎర్ర ప్రియాంక, ఇక్కడి పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారులు ఉప్పల శ్రీనివాస్, ప్రస్తుత మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, అధికారులు ప్రసాద్, రాజేందర్, రాము, లక్ష్మీనారాయణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమడి శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, మార్కెట్ సిబ్బంది భౌతికాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెటింగ్ శాఖతోపాటు రైతు సమస్యలపై ఆమె చూపిన శ్రద్ధను గుర్తు చేసుకున్నారు.
పెద్దమ్మగడ్డలో అంత్యక్రియలు


