మహబూబాబాద్: గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేరకు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీఎస్‌ఏపీ) కార్యక్రమం చేపట్టింది. జిల్లాస్థాయిలో సర్పంచ్‌లకు, కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సభలను నిర్వహించి స్థానిక అవసరాలను గుర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పఽథకాల సమన్వయం ద్వారా సుస్థిరమైన, సమగ్ర, అవసరాల ఆధారిత గ్రామీణ అభివృద్ధి సాధించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
482 జీపీలు..
జిల్లాలోని 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 6,35,872 జనాభా ఉంది. ఆయా జీపీలకు గాను 406 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమం చేపట్టింది. కాగా, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్ నుంచి కార్యక్రమ అంశాలపై డీపీఓ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కార్యక్రమం చేపట్టారు.
జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం..
గత నెల 8న జిల్లా కేంద్రంలో జీపీఎస్‌ఏపీ కార్యక్రమంపై జిల్లాస్థాయిలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరించారు. అవగాహన తర్వాత శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ప్రణాళికలోని అంశాలు..
ప్రణాళికలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, రహదారులు, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి మొదలైన అంశాలు ఉన్నాయి.
గ్రామ సభల ద్వారా..
ప్రతీ గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించాలి. స్థానిక అవసరాలను గుర్తించడం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటారు. అన్ని అంశాలను నమోదు చేసుకుంటారు. ప్రణాళికను ఐదేళ్ల పాటు నిర్వహణకు రూపొందించి అమలు చేస్తారు.
పలుశాఖల భాగస్వామ్యంతో..
ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, స్రీనిధి, వీబీజీ రాంజీ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేశారు. ఆయా శాఖల నిధులతో పాటు జీపీకి వచ్చే నిధుల నుంచి అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. ఆయా శాఖల డేటాను డ్యాష్ బోర్డు మాడ్యూల్స్‌లో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది.
పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు గ్రామాలు..
కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద బయ్యారం మండలంలోని కోటగడ్డ గ్రామం, మరిపెడ మండలం అబ్బాయి పాలెం, మానుకోట మండలంలోని జంగిలిగొండ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆ గ్రామాల్లో గ్రామ సభలు, ఇతర ప్రక్రియ పూర్తి చేశారు. 100 శాతం డేటాను నమోదు చేసి డెమో లాగిన్‌లోకి పంపారు. రాష్ట్ర స్దాయిలో ప్రత్యేక మ్యానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 1నుంచి 15వ తేదీ వరకు గ్రామ సభలు పూర్తి చేసి డేటాతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఈనెల 31లోగా పూర్తి చేసేలా కసరత్తు..
జిల్లాలోని అన్ని జీపీల్లో గ్రామ సభలు నిర్వహించి జీపీఎస్‌ఏపీ పూర్తి అయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 31లోగా పూర్తి చేయాలని డీపీఓ ఆదేశాలతో కార్యదర్శులు ఆప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
గ్రామాల అభివృద్ధి కోసమే..
గ్రామాలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా మార్చడం కోసమే జీపీఎస్‌ఏపీ కార్యక్రమం చేపట్టింది. జిల్లాలో గ్రామసభలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈనెలాఖరులోగా కార్యక్రమం పూర్తి అవుతుంది.
– రేవంత్, డీపీఓ
జీపీల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
కొనసాగుతున్న గ్రామ సభలు
పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు గ్రామాలు
ఎంపిక
ప్రణాళికలో ఐదు సంవత్సరాల అభివృద్ధి


