● జిల్లా జడ్జి మురళీమోహన్
మహబూబాబాద్ రూరల్: అవయవదానం గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఒకరి చిన్న త్యాగం మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ పొందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ధైర్యంతో ముందుకు వచ్చి అవయవ దానానికి అంగీకరిస్తే, ఎంతోమంది నిరాశలో ఉన్న బాధితులకు నూతన జీవితాన్ని అందించవచ్చని తెలిపారు. అవయవ దానంపై సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలను తొలగించి, ప్రతీ ఒక్కరు దీనిపై విస్తృత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అవయవ దానం ద్వారా కాలేయ మార్పిడి చేయించుకున్న పరకాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అవయవాల కోసం ఎదురు చూసే వారికి జీవన్ దాన్ సంస్థ వరంలాంటిదాన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ కేంద్రంగా ఇది పనిచేస్తుండగా అవయవం అవసరమైన వారు జీవన్ దాన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షాలిని షాకెల్లి, న్యాయమూర్తులు స్వాతి మురారి, అర్వపల్లి కృష్ణతేజ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


