మరిపెడ రూరల్ : మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం స్టేజి సమీపంలో గురువారం డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో కారు వెనుక భాగం దెబ్బతిన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అనుచరులు, స్థానికులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ముందుగా వెళ్తున్న ఓ బైక్ ఆకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. అదే సమయంలో ఎదురుగా కూలీలు వస్తుండటంతో వారిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ అప్రమత్తమై వాహన వేగాన్ని తగ్గించారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు అదుపుతప్పి మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కాగా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధరావత్ తండా గ్రామస్తులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న అనంతరం ఊపిరిపీల్చుకున్నారు.


