సీఎంఆర్ పెట్టని మిల్లర్లపై ఒత్తిడి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో పలువురు మిల్ల ర్లు సీఎంఆర్ పెట్టడంలో అలసత్వం వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లలకు తరలించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ పెట్టకుండా.. ధాన్యం అమ్ముకుంటున్నారు. రెండేళ్లు గడిచినప్పటికీ మిల్లుల్లో ధాన్యం చూపించడం లేదు. ప్రభుత్వానికి బియ్యం పెట్టకుండా మొండికేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేసి మొండికేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ముక్కుపిండి డబ్బులు వసూళ్లు చేసే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.
ధాన్యం దిగుమతి చేసుకొని రూ.130కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా మిల్లర్లు మొండికేస్తున్నారు. జిల్లాలో 2017–22 మధ్యకాలంలో యాసంగి, వానాకాలం సీజన్‌లలో సీఎంఆర్ పెట్టని ఐదు మిల్లుల యజమానులు రూ.15కోట్లు బకాయిలు పడ్డారు. దీంతో ఇప్పటికే వారిపై ఆర్‌ఆర్ యాక్ట్‌కింద కేసులు నమోదు చేశారు. 2021–22 సీజన్‌లో ధాన్యం తీసుకొని 10 రైస్‌మిల్లుల యజమానులు సుమారు రూ.15కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే 2022–23 సీజన్‌లో ధాన్యం దిగుమతి చేసుకున్న 21మంది మిల్లర్లు సీఎంఆర్ పెట్టలేదు. అయితే ఆ ధాన్యం ప్రభుత్వం ఇతర వ్యాపారులకు వేలం ద్వారా కేటాయించారు. అయితే వేలం వేసిన వారికి ధాన్యం ఇవ్వకుండా ఉన్నారు. ఇలా వారినుంచి సుమారు రూ.95కోట్లు రావాల్సి ఉంది. అయితే వీరికి ఆగస్టు 4వరకు గడువు ఇచ్చారు. అదే విధంగా ఆలస్యంగా బియ్యం పెట్టినవారు రూ.5కోట్లు బకాయి ఉన్నారు. ఇలా జిల్లాలో మొత్తం రూ. 130కోట్ల విలువచేసే బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న వేలాది కోట్ల విలువచేసే సీఎంఆర్ పెట్టకుండా మొండికేసిన వారి డబ్బులు వసూలు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటి వ రకు సీఎంఆర్ పెట్టని మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్ట్‌పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. మిల ్లర్లకు, అధికారుల మధ్య సమన్వయంతో మామూళ్లు తీసుకొని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అయి తే ప్రభుత్వం నుంచిఒత్తిడి పెరగడంతో అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఆర్‌ఆర్ యాక్ట్ పెట్టి వదిలి వేయకుండా రికవరీలో రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నారు. కేసులు పెట్టడమే కాకుండా రికవరీ చేసే పనికూడా అధికారులకే అప్పగించనున్నారు.
జిల్లాలో సీఎంఆర్ పెట్టకుండా ఉన్నవారిపై అవసమైతే పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అయితే రూ.10కోట్లకు పైగా బకాయిలు పడ్డ ఐదుగురు రైస్ మిల్లు యజమానులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. సంబంధిత మిల్లర్లకు ఎక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి.. విలువైన ప్లాట్లు, ఇళ్లు, ఇతర ఆస్తులు ఏమీ ఉన్నాయి అని ఆరాతీసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగానే మహబూబాబాద్ పట్టణంలోని ఓ మిల్లర్‌కు సంబంధించిన ఆస్తుల జాబితాను సేకరించి ఆర్‌ఆర్ యాక్ట్ కింద వాటిని జప్తు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఐదుగురిపై కేసులు నమోదు
మరో 31మందిపై ఆర్‌ఆర్
యాక్ట్‌కు సిద్ధం
రూ.130కోట్ల వసూళ్లపై దృష్టి


