గత ఏడాది 67 కేసులు..
● ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌తో సత్ఫలితాలు
● కేసుల నమోదులో పుట్టినతేదీ ప్రామాణికం
● జూలైలో ఇప్పటి వరకు 8కేసులు
మహబూబాబాద్: తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించడం, బాలకార్మికుల విముక్తి లక్ష్యంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం పని చేస్తోంది. పోలీస్‌ల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఆ విభాగంతో పాటు పలుశాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ నిర్వహిస్తున్నారు. ఈమేరకు స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలు ఇస్తోంది. తప్పిపోయిన పిల్లలను పట్టుకుని వారి తల్లితండ్రులకు అప్పగిస్తున్నారు. తనిఖీలతో బాల కార్మికుల సంఖ్య కూడా తగ్గుతోంది.
జిల్లాలో రెండు టీంలు..
జిల్లాలో రెండు డివిజన్‌లు ఉండగా మానుకోట డివిజన్‌కు ఒక టీం, తొర్రూరు డివిజన్‌కు మరో టీం ఏర్పాటు చేశారు. ప్రతీ టీంలో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్, డీసీపీఓ విభాగం నుంచి ఒకరు, చైల్డ్ హెల్ప్‌లైన్ నుంచి ఒకరు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ నుంచి ఒకరు, కార్మికశాఖ నుంచి ఒకరు స్వచ్ఛంద సంస్థ నుంచి ఒకరు టీం సభ్యులు ఉంటారు. ఆరెండు టీంలు స్పెషల్ డ్రైవ్ కోసమే.. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలోనే తనిఖీలు జరుగుతాయి.
రెండు రకాల స్పెషల్ డ్రైవ్..
ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రతీ సంవత్సరం జనవరిలో, ఆపరేషన్ మస్కాన్ పేరుతో జూలైమాసంలో తనిఖీలు చేస్తారు. తప్పిపోయిన పిల్లల కోసం, బాల కార్మికుల విముక్తి కోసం కృషి చేస్తారు. ప్రస్తుతం ఆపరేషన్ ముష్కాన్ కొనసాగుతోంది.
రెండు రకాలుగా కేసులు..
14సంవత్సరాల లోపు పిల్లలు పని చేయవద్దు. కా గా షాపుల్లో పనిచేస్తే యజమానులపై కేసులు పెడుతారు. ఆపిల్లలను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. కేసులు నమోదు చేయగా సీడబ్ల్యూసీ బెంచ్ ఎదుట హాజరుపరుస్తారు. బెంచ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు. కాగా, బిహార్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పిల్లలు ఎక్కువగా తనిఖీల్లో పట్టుబడుతున్నారు. వారికి బాలసదనంలో వసతి కల్పించి భోజనం ఇతర సదుపాయాలు కల్పిస్తారు. 14 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు ప్రమాదకరమైన ఇటుక బట్టీలు, హోటళ్లు, మైనింగ్, బంగారం షాపులు, మిల్లులు తదితర వాటిల్లో పనిచేస్తే యజమానులపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవుతుంది. ఇది కూడా పిల్లల పుట్టినతేదీ ఆధారంగా చేసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు.
తల్లిదండ్రులు ఆలోచించాలి
పిల్లలను పనిలో పెట్టే ముందు తల్లిదండ్రులు ఆలోచించాలి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బాల కార్మికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. కేసులతో షాపుల యజమానులు ఆలోచిస్తున్నారు.
–పుట్ట కమలాకర్, డీసీపీఓ
గత ఏడాది ఆపరేషన్ స్మైల్ (జనవరి మాసం)లో 25 కేసులు కాగా, వాటిలో 14 కేసులు ఎఫ్‌ఐఆర్ అయినట్లు తెలిపారు.
గత ఏడాది ఆపరేషన్ ముస్కాన్ (జూలై)లో 42 కేసులు కాగా, వాటిలో 21కేసులు ఎఫ్‌ఐఆర్ అయ్యాయి.
ఈ ఏడాది ఆపరేషన్ స్మైల్ (జనవరి మాసం)లో 38 కేసులు కాగా, వాటిలో 18కేసులు ఎఫ్‌ఐఆర్ అయ్యాయి.
ప్రస్తుతం ఆపరేషన్ ముస్కాన్‌లో ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో 8 కేసులు కాగా దానిలో ఒకటి ఎఫ్‌ఐఆర్ అయింది. వారిలో ఇద్దరు పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీసీపీయూ విభాగం అధికారులు తెలిపారు.


