నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాక

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

భూపాలపల్లి రూరల్‌: సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేడు (సోమవారం) భూపాలపల్లి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఎల్‌వీ కన్వెన్షన్‌ హాల్‌లో సమావేశానికి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి జెన్‌కో గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుని మంగళవారం ఉదయం గని గేట్‌ మీటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ గనిని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

హేమాచలక్షేత్రంలో కోలాహలం

మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి స్వామిని వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు రాజీవ్‌శర్మ, ఈశ్వర్‌చంద్‌ శర్మ భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement