ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకున్న ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకున్న ఎమ్మెల్యే

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ స్వయంగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్‌ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని మాట్లాడారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ప్రతీ పథకానికి అర్హులు కావాలంటే ఫార్మర్‌ ఐడీ ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.విజయచంద్ర, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు ఉన్నారు.

ఉపాధ్యాయుల

వినూత్న ప్రచారం

కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి కేసముద్రంస్టేషన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అడ్మిషన్లకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఓ ఆటోకు మైక్‌ అమర్చి పదో తరగతిలో తమ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు తెలుపుతూ పట్టణంలోని అమీనాపురం, కిష్టాపురం, గిర్నితండాలో గురువారం ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పాఠశాల ప్రత్యేకతలు తెలుపుతూ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బందెల రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

మహబూబాబాద్‌: గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పాఠకులు గురువారం జిల్లా గ్రంథాలయంలో నెలకొన్ని సమస్యలపై వెన్నం శ్రీకాంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు పుస్తకాలు కావాలని, ఇతర ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈసందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పాఠకులకు మెరుగైన సౌకార్యాలు కల్పిస్తామన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

మహబూబాబాద్‌ అర్బన్‌: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఐఈఓ మదార్‌గౌడ్‌ గురువారం తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ గ్రూప్‌లో 1,110 మంది విద్యార్థులకు గాను 903 మంది ఉత్తీర్ణులయ్యారని, ఒకేషనల్‌ గ్రూప్‌లో 340 మంది విద్యార్థులకు 268 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్‌ గ్రూప్‌లో 2,141 మంది విద్యార్థులకు 1,652 మంది ఉత్తీర్ణత సాధించారని, ఒకేషనల్‌ గ్రూప్‌ లో 461 మంది విద్యార్థుల గాను 337 మంది పాసైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు.

12 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలంలోని జంగిలికొండ క్రాస్‌ వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 12 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పట్టుకుని కేసు నమోదు చేశామని రూరల్‌ ఎస్సై పి.రాజు గురువారం తెలిపారు. రూరల్‌ ఏఎస్సై జాకీర్‌ తమ సిబ్బందితో కలిసి కేవుల తండా వైపు నుంచి వస్తున్న టాటాఏస్‌ ట్రాలీని ఆపి తనిఖీ చేయగా అందులో 24బస్తాలు (12 క్వింటాళ్ల) నల్లబెల్లం లభ్యమైందన్నారు. అలాగే 50 కిలోల పటిక, 10 లీటర్ల గుడుంబా ఉందని వివరించారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య బావుసింగ్‌, రోటిబండ తండాకు చెందిన తేజావత్‌ మల్సూర్‌పై కేసు నమోదు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement