● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీటీఎన్‌ఎస్ ద్వారా ప్రతీ పిటిషన్, కేసు వివరాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పారదర్శకత, జవాబుదారీతనం, సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేస్తున్న పనుల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. గంజాయి విక్రేతలు, రవాణాదారులు, పాత గంజాయి కేసుల నిందితులు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. మళ్లీ నేరాలకు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు, వాహనాల తనిఖీలు, విస్తృత నిఘా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి, కార్డన్‌సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో భద్రతా భావం తీసుకురావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా క్షేత్రస్థాయిలో కఠిన అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలను సమర్పించడం ద్వారా నిందితులకు శిక్షలుపడేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు.
నేటి నుంచి మార్కెట్‌కు సెలవులు
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12న(శుక్రవారం) ప్రముఖ వ్యాపారి తాటికొండ పుల్లయ్య సంతాప సూచకంగా చాంబర్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు, 13, 14న(శని,ఆదివారం) వారాంతపు సెలవులు, 15న(సోమవారం) అమావాస్య సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి ఈనెల 16న మార్కెట్ పునఃప్రారంభమవుతుందని చెప్పారు.


