● టేకులతండాలో ఘటన
కురవి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని నల్లెల్ల శివారు గాజ తండా జీపీ పరిధి టేకుల తండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇదే మండలం కంచర్లగూడెం తండా గ్రామానికి చెందిన భూక్య శాంతి కుమార్తె కల్యాణి(27)తో టేకుల తండాకు చెందిన గుగులోత్ నరేశ్‌కు పరిచయడం ఏర్పడింది. 2017లో ప్రేమించుకున్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు. ఇటీవల కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. దీంతో కల్యాణి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో గుర్తించిన కుటుంబీకులు, భర్త నరేశ్ హుటాహుటిన మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సంతోశ్ గురువారం తండాకు చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. మృతురాలికి నాలుగేళ్ల బాబు, 11 నెలల పాప ఉంది.
హత్యాయత్నం నిందితులపై కేసు
టేకుమట్ల: నిద్రిస్తున్న వ్యక్తిని విద్యుత్ షాక్‌కు గురి చేసి హత్య చేసేందుకు యత్నించి, విఫలమై గొతు నులిమి హత్యాయత్నానికి పాల్ప డిన ఇద్దరిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి గ్రామానికి చెందిన బచ్చల రవి కుటుంబం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో రవి భార్యకు మండలంలోని గర్మిళ్లపల్లి శివారు బోయినిపల్లికి చెందిన ఈర్ల రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై పలుమార్లు రవి తన భార్యను హెచ్చరించాడు. ఈ నెల 9న రవి జమ్మికుంటకు వ్యక్తిగత పనిపై వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుని నిద్రిస్తున్న సమయంలో భార్య, ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్న రాజు.. రవి కాళ్లకు విద్యుత్ వైర్లు తగిలించి షాక్‌కు గురి చేసేందుకు యత్నించారు. వెంటనే మెళకువకు వచ్చిన రవి కేకలు వేయగా ఇద్దరు కలిసి గొంతు నులిమి హత్యాయత్నం చేయగా తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలుపడంతో అక్కడి నుంచి ఇద్దరు పరారయ్యారు. కాగా, రవి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


