‘దిక్సూచి’ పేరిట రూ.46.50 లక్షలు హాంఫట్‌ | - | Sakshi
Sakshi News home page

‘దిక్సూచి’ పేరిట రూ.46.50 లక్షలు హాంఫట్‌

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

కలెక్టర్‌ చొరవ..

వెలుగులోకి అక్రమాలు

జనగామ: ‘దిక్సూచి’ కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకాల కొనుగోలు పేరిట రూ.46లక్షల 50వేల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ ఘటన జనగామ కలెక్టరేట్‌లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, డీడీఓ హోదాలో ఉన్న తహసీల్దార్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌పై జనగామ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ఏఓ రవికిరణ్‌ బుధవారం తెలిపారు.

అసలేం జరిగింది..

పదో తరగతి విద్యార్థుల కోసం 15వేల ‘దిక్సూచి’ కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకాలు ఒక్కొటి రూ.310 చొప్పున మొత్తం రూ.46లక్షల50వేలకు హనుమకొండకు చెందిన మెస్సర్స్‌ రిత్విక్‌ గ్రాఫిక్స్‌ ప్రొప్రైటర్‌ విజయ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ఏఓ, డీడీఓ అయిన తహసీల్దార్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ ఈ బిల్లును ప్రాసెస్‌ చేసి 2026, మార్చి26న ఆర్‌టీజీఎస్‌ ద్వారా మొత్తం సొమ్ము చెల్లించారు.

ఆడిట్‌లో అక్రమాలు బట్టబయలు..

కలెక్టర్‌ సందీప్‌ కమార్‌ ఝా ఆదేశాలతో జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌ నిర్వహించిన విచారణలో అవకతవకలు వెలుగుచూసినట్లు ఫిర్యాదులో పొందు పరిచారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల నమోదు 4,635 మాత్రమే ఉండగా, సుమారు 5,100 పుస్తకాలు అవసరమని గుర్తించారు. కాగా, 15 వేల పుస్తకాలు ఆర్డర్‌ చేశారు. అంటే అవసరానికి మూడు రెట్లు ఎక్కువ. ఇందులో రూ.46.50 లక్షల భారీ కొనుగోలుకు ఓపెన్‌ టెండర్‌ పిలవకుండా కేవలం మూడు సంస్థల నుంచి డైరెక్ట్‌ కొటేషన్‌ తీసుకున్నారు. డీఈఓ ఇండెంట్‌ లేకపోవడంతో పాటు కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అనుమతి కూడా తీసుకోలేదని అందులో ఉంది. డబ్బుల గోల్‌మాల్‌ ఇలా ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి లిఖితపూ ర్వకంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక్క పుస్తకం కూడా జిల్లాకు చేరుకోలేదు. గూడ్స్‌ రిసిప్ట్‌ నోట్‌, స్టాక్‌ ఎంట్రీ, పంపిణీ రికార్డు, రిసిప్ట్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ ఏదీ లేకుండానే యథేచ్ఛగా చెల్లింపులు కానిచ్చేశారు.

సాక్ష్యాలు మాయం చేసే కుట్ర

పుస్తకాల కొనుగోలు పేరిట రూ.46.5 లక్షలు డెబిట్‌ అయిన వెంటనే కలెక్టరేట్‌ అధికారిక ఈ–మెయిల్‌

collecto-jangaon@ gmail. comMS$ HDFC, IDFC FIRST బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్‌ అలర్ట్‌ అయినట్లు మెయిల్‌ వచ్చింది. ప్రస్తుత కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 4.30కు ఈ చెల్లింపు జరిగింది. అధికారిక మెయిల్‌ పాస్‌వర్డ్‌లు తెలిసిన శ్రీకాంత్‌ ఈ లావాదేవీకి సంబంధించిన అలర్ట్‌ మెయిల్స్‌ను, కమ్యూనికేషన్లను డిలీట్‌ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్త కలెక్టర్‌కు ఈ లావాదేవి తెలియకుండా, తనను, ఏ–2 రిత్విక్‌ గ్రాఫిక్స్‌ను చట్టపరమైన శిక్ష నుంచి కాపాడుకునేందుకే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దర్యాప్తు..

హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, ఎఫ్‌ఐఆర్‌ఎస్‌టీ బ్యాంకు రికార్డులు, గూగుల్‌ లాగిన్‌ డేటా, ఐపీ అడ్రస్‌లు, డివైజ్‌ డేటా, యాక్టివిటీ హిస్టరీ, ఫోరెన్సిక్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారిక ఇ–మెయిల్‌ ను అనధికారికంగా యాక్సెస్‌ చేసి సాక్ష్యాలు మాయం చేయడం తీవ్రమైన నేరమని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేశారు.

ముగ్గురిపై కేసు నమోదు..

ఆధారాలు లేకుండా జీమెయిల్‌ అకౌంట్‌ నుంచి తొలగించిన వారిపై చట్ట ప్రకారం అప్పటి కలెక్టర్‌ ఏఓ శ్రీకాంత్‌, ప్రొప్రైటర్‌ విజయ్‌, హనుమకొండ గ్రాఫిక్స్‌ రుత్విక్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రస్తుత కలెక్టరేట్‌ ఏఓ రవికిరణ్‌ జూన్‌ 6న జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

బాధ్యతలు స్వీకరించగానే ఆరా..

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా జిల్లాకు చేరలేదని గుర్తించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. కాగా, జిల్లా పాలనపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తనదైన శైలిలో ముందుకెళ్తుతుండగా, ఈ కేసులో పూర్తిస్థాయి నిజాలు బయటకు తీస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

విద్యాశాఖలో జరిగిన కుంభకోణాన్ని ప్రస్తుత కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా గుర్తించి వెలుగులోకి తెచ్చారు. అవినీతిపై ఉక్కు పాదం మోపుతున్న కలెక్టర్‌ చొరవతోనే ఈ భారీ భాగోతం బయటపడింది. మైనింగ్‌, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్ర మంలోనే విద్యాశాఖలో జరిగిన ఆర్థిక లావాదేవీల పై దృష్టి సారించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో గతేడాది ‘దిక్సూచి’ కార్యక్రమాన్ని చేపట్టారు.

జనగామ కలెక్టరేట్‌లో వెలుగులోకి..

పుస్తకాలు రాకుండానే డబ్బులు డ్రా

గత తహసీల్దార్‌ శ్రీకాంత్‌పై కేసు

Advertisement
 
Advertisement
Advertisement