దోపిడీకి పాల్పడిన పాత నేరస్తుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దోపిడీకి పాల్పడిన పాత నేరస్తుల అరెస్ట్‌

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

ఖిలా వరంగల్‌ : ఏకాంతంగా ఉన్న జంటను బెదిరించి దోపిడీకి పాల్ప డిన ముగ్గురు పాత నేరస్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి నగదు, వెండి, బంగారు ఉంగరాలు, బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్‌ కాలనీ ఇన్‌స్పెక్టర్‌ కర్రె స్వామి తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సైలతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన ప్రస్తుతం కాజీపేట వైఎస్సార్‌ నగర్‌లో నివాసం ఉంటున్న బౌరి పవన్‌ సింగ్‌, అదే ప్రాంతానికి చెందిన బౌరి రవీందర్‌ సింగ్‌, రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన బాపూరి సికెందర్‌ సింగ్‌ పాత నేరస్తులు. వీరు టీమ్‌గా ఏర్పడి నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న ఒక జంటలను రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి భయభ్రాంతులకు గురిచేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న నిందితులు ఉర్సుగుట్ట – భట్టుపల్లి రోడ్డులో వేచి చూస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు, యువతి బైక్‌పై వచ్చి ఓ పెట్రోల్‌ బంక్‌ ఎదుట ఉన్న ఒక వెంచర్‌లోకి వెళ్లడాన్ని గమనించారు. వారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి నిందితులు అక్కడికి చేరుకుని ఆ జంటను చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసి ఇవి మీ తల్లిదండ్రులకు పంపుతాం.. మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. ఆ జంట నగదు లేదని చెప్పగా నిందితులు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు. పవన్‌ సింగ్‌ సదరు యువతి చేతికి ఉన్న బంగారు, రవీందర్‌ సింగ్‌ ఆ యువకుడి చేతికి ఉన్న వెండి ఉంగరాలను లాక్కున్నారు. ఇదే క్రమంలో సికెందర్‌ సింగ్‌ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనంతరం ఆ వీడియోలను డిలీట్‌ చేసినట్లు నటించి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, దోచుకున్న ఉంగరాలను వరంగల్‌లో విక్రయించేందుకు నిందితులు బైక్‌పై వస్తుండగా ఎస్సై శ్రవణ్‌,హెడ్‌ కానిస్టేబుల్‌ నరేందర్‌, కానిస్టేబుళ్లు వాజీద్‌, ప్రవీణ్‌ రెడ్డి, నాగేశ్వర్‌ రావు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి బంగారు, వెండి ఉంగరాలు మూడు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

నగదు, ఉంగరాలు, బైక్‌ స్వాధీనం

వివరాలు వెల్లడించిన

ఇన్‌స్పెక్టర్‌ స్వామి

Advertisement
 
Advertisement
Advertisement