మేడారం అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మేడారం అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ

మంత్రి సీతక్క

ఎస్‌ఎస్‌ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ(గద్దెలు) ప్రాంగణాన్ని భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దడంతోపాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మేడారం హరిత హోటల్‌లో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ మేడారం మహాజాతర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రత, పరిశుభ్రత, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్య సేవల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శాశ్వత నిర్వహణ వ్యవస్థ ఉండేలా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక మెయింటెనెన్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు..

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చే అవకాశమున్నందున ముందస్తుగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత స్నాన ఘట్టాలు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను దశలవారీగా ఏర్పాటు చేయాలని సూచించారు.

జంపన్నవాగును పర్యాటక కేంద్రంగా..

జంపన్నవాగు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే, మేడారంలో శాశ్వత ప్రాతిపదికన 30 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అంతకు ముందు వనదేవతలను దర్శించుకున్నారు. ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement